తెలంగాణ

telangana

ETV Bharat / sitara

PAWAN KALYAN: చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. వైకాపా నేతలకు పవన్ వార్నింగ్ - పవన్ కళ్యాణ్ సమావేశం

'సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే.. వైకాపా నేతలు కాలిపోతారు.. జాగ్రత్త' అంటూ జనసేనాని పవన్‌ కల్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. 'ఇది వైకాపా రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్‌..' అని వ్యాఖ్యానించారు. వైకాపా రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హితవు పలికారు. సాయిధరమ్​ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు పవన్​ హాజరయ్యారు.

pawan-kalyan-fire-on-ycp-govt
pawan-kalyan-fire-on-ycp-govt

By

Published : Sep 25, 2021, 11:22 PM IST

Updated : Sep 26, 2021, 7:21 AM IST

సాయిధరమ్​ తేజ్ హీరోగా నటించిన 'రిపబ్లిక్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్​కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. సాయితేజ్​ ఆసుపత్రిలో ఉన్నందు వల్లే ఈ కార్యక్రమానికి హాజరైనట్లు తెలిపిన పవన్ కల్యాణ్.. అతివేగమే తేజ్‌ ప్రమాదానికి కారణమని ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. ఆటోను దాటే క్రమంలో ఇసుకపై జారిపడి సాయితేజ్ కిందపడ్డాడన్నారు. 'రిపబ్లిక్' సినిమా విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వ వైఖరిపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పేరు చెప్పి సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం పెత్తనం ఏంటి..?

'సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే.. వైకాపా నేతలు కాలిపోతారు.. జాగ్రత్త' అని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వం పెత్తనం ఏంటని ప్రశ్నించారు. 'ఇది వైకాపా రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్‌..' అని వ్యాఖ్యానించారు. వైకాపా రిపబ్లిక్ అనుకుంటే జనం తిరగబడతారని హితవు పలికారు. గూండాలకు భయపడితే బతకడం అసాధ్యమన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమపై వైకాపా ప్రభుత్వం తీరు మారాలన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని మార్చేందుకు ఏం చేయాలో తమకు తెలుసన్న పవన్‌... 'తెలుగు చిత్రపరిశ్రమను ఎవరూ అడ్డుకోలేరు.. ఆపలేరు' అని స్పష్టం చేశారు.

దోపిడీలు, దొమ్మీలు చేయలేదు...

సినిమా పరిశ్రమకు కులాలు, మతాలు ఉండవని పవన్ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. సినిమా పరిశ్రమలో అనేక కష్టాలు ఉంటాయని, సినీ పరిశ్రమ జోలికి వస్తే సినీ నటులందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. వ్యక్తిత్వానికే విలువ ఇస్తానని పవన్‌ స్పష్టం చేశారు. సినిమావాళ్లు దోపిడీలు, దొమ్మీలు చేయడం లేదని, ప్రేక్షకులను అలరిస్తూ కష్టపడుతున్నారన్నారు. తనతో గొడవ ఉంటే తన సినిమాలు ఆపేయాలని, అంతే గానీ మిగతావారి సినిమాల జోలికి రావొద్దని కోరారు. సినిమాలపై ఆధారపడి హైదరాబాద్‌లోనే లక్ష మంది జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. తమలో ఉన్న అభిప్రాయ భేదాలను శత్రుత్వంగా భావించడం సరికాదని హితవు పలికారు.

డబ్బు లేదు కాబట్టే టిక్కెట్లు అమ్మే ఆలోచన...

సినిమావాళ్ల కష్టాలపై మోహన్‌బాబు మాట్లాడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. చిత్ర పరిశ్రమ గురించి వైకాపా నేతలకు చెప్పాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనలు రేపు మోహన్‌బాబు విద్యాసంస్థలకూ వర్తిస్తాయని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం వద్ద డబ్బు లేదు కాబట్టే సినిమా టికెట్లు అమ్మే ఆలోచన చేస్తోందని ఎద్దేవా చేశారు. సినిమా టికెట్ల ఆదాయం చూపించి బ్యాంకు రుణాలు పొందేందుకు ప్రణాళికలు చేస్తోందని మండిపడ్డారు. సినిమావాళ్లు పన్నులు కడుతున్నారు.. ధైర్యంగా మాట్లాడాలని పవన్‌ సూచించారు.

కాపు రిజర్వేషన్ల గురించి మాట్లాడరా..?

వైఎస్ వివేకా హత్య గురించి మీడియా మాట్లాడాలని పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. కోడికత్తితో ఒక నేతను పొడిచారు, ఆ కేసు ఏమైంది? అని ప్రశ్నించారు. పోడుభూమి సాగు చేసుకునే గిరిజనుల గురించి మాట్లాడాలని పవన్‌ సూచించారు. వైకాపా ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? అని నిలదీశారు. రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారని ప్రశ్నించిన పవన్‌... రాజకీయ హింస గురించి మాట్లాడాలని సవాల్ చేశారు.

'వైఎస్ వివేకా హత్య గురించి మీడియా మాట్లాడాలి. కోడికత్తితో ఒక నేతను పొడిచారు, ఆ కేసు ఏమైంది. ? పోడుభూమి సాగు చేసుకునే గిరిజనులపై మాట్లాడాలి. వైకాపా ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా..? రాయలసీమలో బలిజలు ఎందుకు నలిగిపోతున్నారు. చిన్నారి హత్యాచారం ఘటనపై మాట్లాడాలి. మీకు ధైర్యం ఉంటే రాజకీయ హింస గురించి మాట్లాడాలి '

- పవన్‌ కల్యాణ్, జనసేన అధినేత

ఇదీచూడండి:చిత్ర పరిశ్రమ వైపు చూస్తే ఊరుకోను:పవన్

Last Updated : Sep 26, 2021, 7:21 AM IST

ABOUT THE AUTHOR

...view details