భారీ వర్షాలతో అల్లాడుతున్న భాగ్యనగరం కోసం తారాలోకం కదిలివచ్చింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో బాధితుల సహాయార్థం తెలుగు చలనచిత్ర సీమ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్, విజయ దేవరకొండతో పాటు దర్శకులు హరీశ్ శంకర్, త్రివిక్రమ్ కూడా తమకు తోచినంత విరాళాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయస్తామని తెలిపారు. వీరితో పాటు జనసేన అధినేత, టాలీవుడ్ అగ్రకథానాయకుడు పవన్ కల్యాణ్.. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.కోటి విరాళాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు.
వరద బాధితుల కోసం పవన్.. రూ.కోటి విరాళం - తెలంగాణ సీఎం సహాయనిధికి పవన్ కోటి సాయం
వరదలతో అతలాకుతలమవుతున్న భాగ్యనగర వాసులను ఆదుకునేందుకు పలువురు విరాళాలు ప్రకటిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు సినీ ప్రముఖులు.. తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. తన వంతుగా రూ.కోటి విరాళమిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.
"కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక రంగం కుదేలైంది. ఈ మహమ్మారితో పాటు ఎడతెరపిలేని వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నివాసాల్లోకి నీళ్లు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం చేపట్టే సహాయ కార్యక్రమాలకు నా వంతు సహకారంగా కోటి రూపాయలను తెలంగాణ ప్రభుత్వానికి విరాళంగా ప్రకటిస్తున్నాను. ప్రజలంతా తమ తోచిన సహకారాలతో పాటు సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని కోరుకుంటున్నా" అని పవన్‌కల్యాణ్ చెప్పారు.