తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
"సాయి కుమార్ గురించి ఎప్పుడో చెప్పాలి.. ఎవరెవరిని మర్చిపోతున్నానా అని వెతుక్కుంటుంటే 'అన్నయ్యా మళ్లీ వావ్ కార్యక్రమానికి వస్తావా' అని సాయి ఫోన్ చేశాడు. అయ్యో! ఇంకా సాయి గురించి చెప్పలేదు కదా అనుకున్నా. సాయి కంటే ముందే అతని తల్లిదండ్రులు మాకు ఆత్మీయులు. వాళ్లమ్మ కృష్ణజ్యోతి గారు నాకు సోదరి సమానం. మా పరుచూరి బ్రదర్స్‌కు రక్తం సంబంధం లేని ఆత్మీయ బంధుత్వం ఉంది సాయి కుమార్ కుటుంబంతోనే. ఎందుకంటే వాళ్ల కుటుంబంలోని నటులందరితోనూ పనిచేశాం. తొలినాళ్లలో మేము రాసిన ముఫ్పై నలభై చిత్రాలు సాయి చేశాడు. అసలు సాయి లేకుండా సినిమా ఉండేది కాదనొచ్చు. అప్పట్లో రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, సాయి, రాజావర్మ ఓ బృందంలా ఉండేవారు. అందరికీ వేషాలు దొరికేలా కథలు రాసేవాళ్లం. అలా ఎక్కువగా రాసింది సాయికే. 'కర్తవ్యం' చిత్రంలో విజయశాంతి తమ్ముడి పాత్రలో అద్భుతంగా నటించాడు. 'డాక్టర్ భవాని'లోనూ అదరగొట్టాడు. శారద సినిమాల్లో చాలా వాటిలో సాయి కుమార్ ఉన్నాడు. ముఖ్యంగా 'మదర్ ఇండియా'లో విశ్వరూపం చూపించాడు. 1985లో ఓసారి రాఘవేంద్రరావు గారు అకస్మాత్తుగా ఫోన్ చేసి షూటింగ్ దగ్గరకు రండి అన్నారు. ఏంటా అని వెళ్తే.. పెళ్లి కొడుకు వేషంలో సాయిని కూర్చోబెట్టారు. 'ఇదెవరు చెప్పారండి? మేం చెప్పలేదు కదా' అంటే.. 'అయ్యో మేకప్ వేసేశారు, అంతగొప్ప నటుడుకి రెండు డైలాగులైనా రాయండి'అంటే అక్కడిక్కడే రాశాం. సూపర్ స్టార్ కృష్ణగారు వచ్చి పెళ్లి చెడగొట్టే సన్నివేశంలో వస్తుంది. 'రౌడీ ఇన్‌స్పెక్టర్'లో విలన్‌గా చేశాడు" అని గోపాలకృష్ణ అన్నారు.