ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో యూట్యూబ్ వేదికగా తన అనుభవాలు పంచుకుంటున్నారు. ఇటీవల రచయిత సత్యానంద్‌తో ఆయన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
సౌమ్యుడు, మితభాషి.. సత్యానంద్
"సత్యానంద్, జంధ్యాల ఇద్దరూ కలిసి పనిచేశారని గతంలో మీకు చెప్పాను. ఇండస్ట్రీకి రాకముందే ఆయన 'మాయదారి మల్లిగాడు', 'కిరాయి కోటిగాడు' చూశాను. నా జీవితంలో.. నేను సినిమా రచయిత కావాలని 1975 డిసెంబర్ 23న హైదరాబాద్‌కు వచ్చా. రాఘవేంద్రరావు గారి 'జ్యోతి' షూటింగ్ జరుగుతున్న సమయంలో ఇక్కడికి వచ్చా. దాని రచయిత సత్యానంద్. కానీ, షూటింగ్ ప్రదేశంలో సత్యానంద్ లేరు. ఆయన చాలా బిజీ. సెట్స్‌లో కనిపించేవారు కాదు. అలా కుదరక మళ్లీ వెళ్లిపోయాను. 1979లో ఎంట్రీ, 80లో ఎన్టీఆర్ నన్ను గుర్తించారు. అలా ఐదారు సంవత్సరాలు పట్టింది మేము రచయితలు అవ్వడానికి. అలా వచ్చాక.. మద్రాస్‌లో ఉన్నా కూడా.. కేవలం ఫంక్షన్లప్పుడు మాత్రమే నటులు, దర్శకులు, రచయితలు కలుస్తుండేవారు. ఆ సినిమాకి రచయిత కాకపోయినా పిలుస్తుండేవారు. ఎందుకంటే హీరో చేసే చిత్రాలన్నీ ఒకే రచయిత రాయరు. నలుగురైదురు రాస్తారు. హీరో తరఫు పీఏలు రచయితలను పిలిచేవారు. అలావారిని ఒకట్రెండు సార్లు కలిశాను.
అలా సత్యానంద్ గారిని కలిసినప్పుడు ఏమర్థమైందంటే.. సత్యానంద్ సౌమ్యుడు, మితభాషి. సామాన్యంగా సినిమా రచయితలు నేను, పోసాని కానీ ఎక్కువగా మాట్లాడుతుంటాం. ఇతను ఆత్రేయ స్టైల్. ఆత్రేయలాగా మౌనంగా ఉండేవారు. మనం మాట్లాడుతుంటే వింటారే తప్ప సమాధానం చెప్పరు. ఆయన సమాధానం కోసం మనం వేచి చూడాలి. సాధారణంగా ఆత్రేయ గారు సీన్ రాస్తే వెంటనే ఇవ్వమని అడగరు. ఇంకో వెర్షన్ రాసివ్వమంటారు. షూటింగ్ ముందు ఇవ్వండి అదే తీస్తారు. కేవలం దర్శకులకు మాత్రమే తెలుసా.. రచయితలకు తెలియదా ఎలా తీస్తారో అని అంటుండేవారు.
వికీపిడియాలో తప్పు చూపిస్తుంది
సత్యానంద్ గారు మాతో పాటు సమానంగా, లేదంటే ఎక్కువగా రాసే ఉంటారు. కానీ విచిత్రం ఏమిటంటే వికీలో మాత్రం 15 సినిమాలు మించి కనపడటం లేదు. కానీ మేము సినిమాకు కథ రాశామా, మాటలు రాశామా, స్ర్కీన్‌ప్లే రాశామా.. ఇలా ఆధారాలు ఉన్నాయి. కానీ సత్యానంద్ వికీలో మాత్రం ఆయన పూర్తి చిత్రాల జాబితా కనిపించలేదు. ఇదే విషయాన్ని మొన్న ఆయన్ను అడిగినా కూడా 'ఫర్వాలేదు సోదరా' అని అన్నారు. మా అన్నయ్య పిలుస్తారు గోపాలకృష్ణా అని.. మళ్లీ సత్యానంద్ గారు పిలుస్తారు అలాగే. అప్పుడప్పుడు సోదరా అంటారు. మా రచయితల సంఘానికి అనేక పర్యాయాలు ఆయన్ని అధ్యక్షుడిని చేయాలని చూశాను. 'వద్దు సోదరా. దానికి చాలా కావాలి. ఆ దివ్యశక్తులన్నీ నీ దగ్గర ఉన్నాయి. అందరినీ ఒప్పించడం, నొప్పించకుండా ఒప్పించడం ఈ శక్తులు అన్ని నీ దగ్గర ఉన్నాయి. నువ్వు ఎలాగో కొనసాగుతున్నావ్ కదా' అంటుండేవారు. ఆయన గౌరవ అధ్యక్షుడిగా పెట్టుకోగలిగానే తప్ప.. అధ్యక్షుడిగా మాత్రం తీసుకురాలేకపోయాను.