south pan india movies: 'భాష వేరు.. నేటివిటీ వేరు' అనే మాటలకి కాలం చెల్లిపోయింది. భావం ఒక్కటైనప్పుడు భాషతో పనేముంది అంటున్నాడు నవతరం సినీ ప్రేమికుడు. హృదయాన్ని స్పృశించే కథ ఉంటే నేటివిటీ సమస్యే కాదని చాటుతూ సినిమాలకి బ్రహ్మరథం పడుతున్నాడు. పాన్ ఇండియా చిత్రాలకు ఇంతకుమించిన అనువైన వాతావరణం ఇంకేం కావాలి? అందుకే ఎంచుకున్న కథ అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉందనిపిస్తే చాలు.. దాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులకి చూపించడమే లక్ష్యంగా రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే దక్షిణాది పాన్ ఇండియా చిత్రాల సత్తా ఏమిటో ‘పుష్ప’తో మరోసారి చాటి చెప్పినట్టైంది.
'బాహుబలి','కేజీఎఫ్' సినిమాలు సాధించిన విజయాలే ఈ ట్రెండ్‌కి స్ఫూర్తిగా నిలిచాయనడంలో సందేహం లేదు. ఇటు మలయాళం నుంచి అటు హిందీ వరకు భాషలన్నిటినీ ఏకం చేశాయి. ఇప్పుడు 'ఆర్‌ఆర్‌ఆర్', 'కె.జి.ఎఫ్-2', 'రాధేశ్యామ్'... ఈ మూడు నాలుగేళ్లుగా ప్రేక్షకుల్ని ఊరిస్తున్నవే. ఇవి నలభై రోజుల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకొస్తుండడం పరిశ్రమవర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆ రెండూ తెలుగు నుంచే..
prabhas radheshyam movie: 'వందేళ్ల తర్వాత రాజమౌళి వల్ల మనం భారతీయ సినిమాలు చేస్తున్నాం. నా దృష్టిలో మనం పాన్ ఇండియా సినిమాలు చేయడం ఇప్పటికే ఆలస్యమైంది' అనేది ప్రభాస్ మాట. ఆయన ‘బాహుబలి’ తర్వాత ఎంచుకునే ప్రతీ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ని లక్ష్యంగా చేసుకున్నదే కావడం గమనార్హం. అందులో భాగంగానే తెలుగు వారైన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించారు. ప్రేమకథతో రూపొందిన ఈ సినిమా రూ.300 కోట్ల పైచిలుకు వ్యయంతో రూపొందింది.