ఆలియా భట్, అనన్యా పాండే, ఊర్వశి రౌతేలా... ఇలా బాలీవుడ్ నాయికలు ఇప్పటికే తెలుగులో సినిమాలు చేస్తున్నారు. కియారా అడ్వాణీ క్రమం తప్పకుండా సినిమాలు చేస్తోంది. త్వరలోనే మరో చిత్రం చేస్తానని ఆమె ఇటీవల ప్రకటించింది. ప్రభాస్‌తో కలిసి నటించేందుకు దీపికా పదుకొణే కూడా పచ్చజెండా ఊపేసింది. వీళ్లతోపాటు మరికొంతమంది తారల్ని తెలుగు చిత్రసీమ రారమ్మంటోందా? ఈ ప్రశ్నకి అవుననే సమాధానమే వినిపిస్తున్నాయి పరిశ్రమ వర్గాలు.
మహేశ్ సినిమాలో విద్యాబాలన్!
మహేశ్‌బాబు కథా నాయకుడిగా తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' విషయంలో పలువురు బాలీవుడ్ తారల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అందులో అనిల్ కపూర్ ఒకరు, విద్యాబాలన్ మరొకరు. ప్రతినాయకుడిగా అనిల్ కపూర్‌ని ఎంపిక చేసే ప్రయత్నాల్లో చిత్రబృందం ఉన్నట్టు సమాచారం. అగ్రనాయిక విద్యాబాలన్‌ను కూడా ఓ కీలక పాత్ర కోసం సంప్రదిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్
శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ కోసం తెలుగు చిత్రసీమ ఎప్పుడో ఎర్ర తివాచీ పరిచింది. ఆమె తొలి సినిమా తెలుగులోనే చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ హిందీలోనే ఆమె తెరంగేట్రం చేశారు. ఆ తర్వాతా పలు తెలుగు కథలు ఆమె దగ్గరికి వెళ్లాయి కానీ కుదరలేదు. ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమా విషయంలో జాన్వి పేరు వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలోని ఓ నాయిక పాత్ర కోసం జాన్విని సంప్రదిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. అందులో నిజం ఎంతన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.