తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఏది పడితే అది రాస్తే కుదరదు.. కథలో సత్తా ఉండాలి'

లాక్​డౌన్​ సడలింపులిచ్చి షూటింగ్​లకు అనుమతినిచ్చినా.. పెద్ద నిర్మాణ సంస్థలు తమ ప్రాజెక్టులను పట్టాలెక్కించడం లేదు. ఎందుకంటే పెద్ద సినిమాల చిత్రీకరణలో ఎక్కువ మంది పాల్గొనాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన్న సినిమాల జోరు పెరుగుతుంది. తక్కువ మంది సిబ్బందితో కొద్ది రోజుల్లోనే షూటింగ్​ పూర్తి చేస్తున్నారు. ఇదే కోవలో 'పలాస' ఫేమ్​ దర్శకుడు కరుణ కుమార్​ వస్తారు. లాక్​డౌన్​ తర్వాత ప్రభుత్వ నిబంధలను పాటిస్తూ.. కేవలం 14 రోజుల వ్యవధిలోనే 'మెట్రో స్టోరీస్‌' వెబ్​ఫిల్మ్​ను రూపొందించారు. 'ఆహా' యాప్​ ద్వారా ఆగస్టులో ఈ చిత్రం విడుదల కానుంది. దానికి సంబంధించిన విశేషాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

palasa fame director karuna kumar special interview
దర్శకుడు కరుణ కుమార్​

By

Published : Jul 24, 2020, 6:59 AM IST

తెలుగు సినిమాకు- సాహిత్యానికి మధ్య తెగిన బంధాన్ని లాక్‌డౌన్‌ సమయంలో ముడివేసే ప్రయత్నం చేశారు 'పలాస' దర్శకులు కరుణ కుమార్‌. తెలుగు సాహిత్యంలో నగర జీవనానికి అద్దం పట్టే నాలుగు కథలను ఎంచుకొని ఓ వెబ్‌ఫిల్మ్‌ను తయారుచేశారు. షూటింగ్‌ చేయాలంటే వణుకు పుడుతున్న ఈ రోజుల్లో అత్యంత కట్టుదిట్టంగా 14 రోజులపాటు శ్రమించి 'మెట్రో స్టోరీస్‌' పేరుతో వెబ్‌ఫిల్మ్‌ను రూపొందించారు. అది ఎలా ఉండబోతుంది? తన తదుపరి సినిమా సంగతేంటో కరుణకుమార్‌ వివరించారు.

మెట్రో స్టోరీస్‌ వెనుక కథేంటి?

హైదరాబాద్‌ మహానగరంలో 10 పాత్రల చుట్టూ తిరిగే నాలుగు కథల సమాహారం మెట్రో స్టోరీస్‌. ఇదొక వెబ్‌ఫిల్మ్‌. గంటా 20 నిమిషాల నిడివితో ఉండే ఫిల్మ్‌ను 'ఆహా' ఓటీటీ ద్వారా ఆగస్టులో విడుదల చేస్తున్నాం. తెలుగు సాహిత్యం నుంచి తీసుకొని సినిమాగా మలిచిన మొట్టమొదటి వెబ్‌ఫిల్మ్‌ ఇది. రచయిత మహమ్మద్‌ ఖదీర్‌ బాబు ఈ కథలను రాశారు. ఆయన దగ్గర హక్కులు తీసుకొని ఈ రూపంలోకి మలిచాం.

వైరస్‌ విస్తృతమవుతున్న సమయంలో షూటింగ్‌ ఎలా చేశారు?

కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ ప్రతి ఒక్కరు కరోనా టెస్ట్‌ చేయించుకొని షూటింగ్‌ చేశాం. హైదరాబాద్‌లోనే ఇండోర్‌ లొకేషన్లలో 14 రోజులు షూటింగ్‌ చేశాం. రాజీవ్‌ కనకాల, గాయత్రి భార్గవి, సన, అలీరజా, నందినిరాయ్‌, నక్షత్ర, తిరువీర్‌, రామ్‌ మద్దుకూరి లాంటి వారు నటించారు.

సాహిత్యం నుంచి తీసుకున్న కథలంటున్నారు. అవి ఎలా ఉండనున్నాయి?

మెట్రో నగరాల్లో మనందరి కళ్లముందు కదిలే జీవితాలు ఈ నాలుగు కథలు. మీ పక్కింట్లో, ఎదురింట్లో కనిపిస్తుంటారు వాళ్లంతా. అన్ని రకాల భావోద్వేగాలతో నిండి ఉంటాయి. తెలుగు సాహిత్యంలో దాదాపు లక్షా 50 వేలపైచిలుకు కథలున్నాయి. వాటిలో చాలా వరకు సినిమాలుగా మార్చుకోవచ్చు. ఈ ప్రయత్నం ఎక్కువగా హిందీ, బెంగాలి, మలయాళంలో చేస్తున్నారు. రాయల్‌ స్టాగ్‌ షార్ట్‌ ఫిల్మ్స్‌ అని ఉంటాయి. వాటిలో అగ్ర నటీనటులు మనోజ్‌ బాజ్‌పాయ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, నసీరుద్దీన్‌ షా, రాధిక ఆప్టే లాంటి వాళ్లు నటిస్తున్నారు. మూడేళ్లుగా తమిళం, మలయాళంలోనూ ఎక్కువగా వెబ్‌ ఫిల్మ్స్‌ తీస్తున్నారు.

భవిష్యత్తు ప్రణాళికలేంటి?

లాక్‌డౌన్‌ సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నా. నా దగ్గరున్న కథలతోపాటు మరో మూడు కథలను సిద్ధం చేసుకున్నా. పలు అగ్ర నిర్మాణ సంస్థలకు, కథానాయకులకు వినిపించి ఓకే చేసుకున్నా. కొవిడ్‌ ఉద్ధృతి తగ్గగానే షూటింగ్‌ మొదలుపెట్టాలనుకుంటున్నా. ఒకవేళ పరిస్థితి ఇలాగే ఉంటే... నా దగ్గరున్న 'పుష్పలత నవ్వింది' కథను అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కోసం సినిమాగా మలుస్తా. ఆ కథకు నిర్మాతలు, నటీనటులు సిద్ధంగా ఉన్నారు.

  1. పరిశ్రమలో రచయితకు మర్యాద ఉండదనే అపప్రద ఉంది. గౌరవం దక్కడం లేదని బాధపడుతుంటారు. రాసే కథలో సత్తా ఉండాలి. ఏది రాస్తే అది కుదరదు. తెలుగు సినిమాకు సాహిత్యానికి ఒకప్పుడు విపరీతమైన అనుబంధం ఉండేది. ఎందుకో ఆ బంధం మధ్యలో తెగిపోయింది. కాలం మారుతున్నా కొద్దీ మళ్లీ చక్కగా రాసేవాళ్లు వస్తున్నారు. కొత్త కథలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి నేను ఇలాంటి వెబ్‌ ఫిల్మ్స్‌ చాలా చేద్దామనుకుంటున్నా.
  2. సినిమాలకు కథలు దొరకడం లేదనే వాదన తప్పు. తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని కథలు ఇతర భాషల్లో లేవు. ఫిల్మ్‌ మేకర్స్‌ మంచి కథలను తీసుకొని సినిమాగా మలిస్తే పరిశ్రమలో మన ప్రతిభకు గుర్తింపు వస్తుంది. ఓటీటీల వల్ల సినీ, సాహిత్య రంగంలో కదలిక వచ్చింది. బండినారాయణస్వామి రచించిన శప్తభూమి, చలం మైదానం, మధుబాబు షాడోలు కూడా తెరమీదకు రాబోతున్నాయి.
  3. నేను కథ రాశాను. ఎవరో వచ్చి తీసుకుంటారనేది వట్టి మాట. పరిశ్రమలో బాగా రాయగలిగినవాళ్లు, అద్భుతంగా రాసేవాళ్లు, నేను రాసిందే కథ అనుకునేవాళ్లు ఉన్నారు. కానీ ఎప్పటికప్పుడు వర్తమాన విషయాలను ఆకలింపు చేసుకొని కథ రాయాలి. ఆ కథ సినిమాగా తీయగలిగింది, విజువల్‌గా బాగుంటుందనుకునేవాళ్లు ప్రయత్నించాలి.

ABOUT THE AUTHOR

...view details