ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'హిందీ మీడియం'తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది పాకిస్థానీ నటి సబా ఖమర్. వ్యాపారవేత్త అజీమ్ ఖాన్‌తో ఇటీవల ఆమె నిశ్చితార్థం జరిగింది. కాగా, తాజాగా ఈ భామ పెళ్లికి బ్రేకప్ చెబుతున్నట్లు ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది.
"వ్యక్తిగత కారణాల వల్ల అజీమ్ ఖాన్‌తో నా ఎంగేజ్‌మెంట్ తర్వాత బ్రేకప్ చెప్తున్నాను. మేమిద్దరం ఇప్పుడు పెళ్లి చేసుకోవడం లేదు. ఇప్పటివరకూ నాకు మద్దతుగా నిలిచిన మీరందరూ ఇకపైనా నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. ఆలస్యం కాకుండా సరైన సమయంలోనే చేదు నిజాలను గ్రహించా. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. నేను అజీమ్ ఖాన్‌ను ఇప్పటివరకూ కలవలేదు. కేవలం ఫోన్ల ద్వారా మాత్రమే మేమిద్దరం మాట్లాడుకున్నాం. వ్యక్తిగతంగా ఇది నాకెంతో కఠినమైన సమయం. కానీ ఇది కూడా ముగిసిపోవాల్సిందే."