కరోనా ప్రభావంతో పరిశ్రమలన్నీ దాదాపు తుడిచిపెట్టుకుపోయాయి. సినిమా రంగానిదీ అదే పరిస్థితి. కోరుకోని అతిథిగా వచ్చిన కరోనా.. ఈ రంగాన్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన పరిశ్రమ తిరిగి మామూలు స్థితికి చేరుకునేందుకు ఇంకా మార్గాలను అన్వేషిస్తూనే ఉంది. ఈక్రమంలో ఎడారిలో ఒయాసిస్‌లా కనిపించిందే ఓటీటీ(ఓవర్ ది టాప్). అయితే.. పరిశ్రమలో అందరికీ కాకపోయినా చాలామందికి కడుపు నింపుతోంది. ప్రేక్షకులను అలరిస్తోంది. ఇలా.. '2020' సినీ పరిశ్రమకు మోయలేనన్ని చేదు జ్ఞాపకాలను మిగిల్చినా.. ఓటీటీ వేదికలకు మాత్రం ఊతమిచ్చింది.
అనామకంగా మొదలై.. ఆధిపత్యం చెలాయిస్తూ..
2018లో భారతీయ ఓటీటీ పరిశ్రమ విలువ 21.5 బిలియన్ డాలర్లు. ఇప్పుడు కేవలం ఒక్క నెట్‌ఫ్లిక్స్ విలువ 217.08 బిలియన్ డాలర్లు.. అంతకంటే ఎక్కువే కావచ్చు. ఈ వ్యవస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 193 మిలియన్ల సబ్‌స్ల్రైబర్లను కలిగి ఉంది. సినీ ఇండస్ట్రీలో థియేటర్లు రాజ్యమేలే సమయంలో అనామక వ్యాపారంగా మొదలైంది ఓటీటీ బిజినెస్. ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోనే అపరిమితమైన లాభాలు గడిస్తోన్న డిజిటల్ వేదికగా అవతరించింది. కరోనా ప్రభావం.. డిజిటలైజేషన్.. ఇలా కారణమేదైనా ఓటీటీల పంట పండటం మొదలైంది.
కారణాలేంటి..?
- తక్కువ ఖర్చుతో సినిమాను ఆస్వాదించే అవకాశం కలగడం.
- భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు సినిమాలు అందించడం.
- థియేటర్లు దొరకని చిన్న, మంచి సినిమాలకు వేదికనివ్వడం.
- ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు
- కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలు, క్రైమ్ స్టోరీలు, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల సినిమాల సమాహారాన్ని ప్రేక్షకుడి ముందుంచడం.
- ఓటీటీ రంగంలో పెరిగిన పోటీతత్వం.
- సినిమాల్లో చూడలేని ప్రతిభావంతులైన నటీనటులను చూసే అవకాశం రావడం.
ఓటీటీ.. పోటాపోటీ..
క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'జమ్‌తారా: సబ్‌కా నంబర్ అయేగా'తో నెట్‌ఫ్లిక్స్ 2020ని ప్రారంభించింది. ఆ వెబ్ సిరీస్ మిశ్రమ ఫలితాలు సాధించింది. ఆ తర్వాత 'ఇండియన్ మ్యాచ్ మేకింగ్' నెట్‌ఫ్లిక్స్‌కు సబ్‌స్ల్రైబర్ల సంఖ్యను భారీగా పెంచింది. ఆ సిరీస్‌లో నటించిన సీమా టపారియాను రాత్రికిరాత్రే పెద్ద సెలబ్రిటీని చేసేసింది. గతేడాది వచ్చిన 'దిల్లీ క్రైమ్' ఏకంగా ఎమ్మీ పురస్కారం గెలిచింది. 'ది ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' కూడా బాగానే అలరిస్తోంది. అమెజాన్ కూడా మంచి వెబ్ సిరీస్‌లు, సినిమాలతో అలరిస్తోంది. ఇందులో వచ్చిన 'జల్లికట్టు' ఏకంగా ఆస్కార్‌కు నామినేట్ అయింది. ప్రాంతీయ అభిమానులను ఆకర్షించడంలో నెట్‌ఫ్లిక్స్ కంటే అమెజాన్ ఒక మెట్టుపైనే ఉంది.
ప్రైమ్‌లో వచ్చిన 'ఆకాశం నీ హద్దురా', 'మిడిల్ క్లాస్ మెలోడిస్' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది వచ్చిన మీర్జాపూర్-2 సిరీస్ ఘన విజయం సాధించింది. దీంతో పాటు 'పాతాల్ లోక్' కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. హర్షద్ మెహతా కథ ఆధారంగా తెరకెక్కిన 'స్కామ్ 1992' సోనీ లివ్‌లో ప్రసారమవుతోంది. అది కూడా ఈ సంవత్సరంలో అతి పెద్ద విజయం సాధించిన వెబ్ సిరీస్‌గా నిలిచింది. సోనీ ఓటీటీ సంస్థ అయిన సోనీలివ్‌కు ఈ వెబ్ సిరీస్ వల్లే ఊహించని రీతిలో చందాదారులు పెరిగిపోయారు. డిస్నీ+హాట్‌స్టార్‌లో శ్రీదేవి తనయ జాన్వీకపూర్ నటించిన గుంజన్ సక్సేనా.. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
వద్దూ వద్దంటూనే.. మద్దతు
సినీ దిగ్గజాలు బయటికి.. తాము ఓటీటీలకు వ్యతిరేకమని.. వాటి వల్ల సృజనాత్మకకు తావుండదని అంటున్నా.. వెబ్ సిరీస్‌లు చేస్తూ పరోక్షంగా ఓటీటీలను ప్రోత్సహిస్తున్నారు. అభిషేక్ బచ్చన్, సుష్మితాసేన్, కరిష్మా కపూర్ వంటి అగ్రశ్రేణి నటులు నటించిన వెబ్‌సిరీస్‌లు ఓటీటీల్లో విడుదల కావడమే ఇందుకు నిదర్శనం. చాలా మంది నటులు సినిమాలతో సాధ్యం కాని గుర్తింపును వెబ్ సిరీస్‌ల ద్వారా సొంతం చేసుకుంటున్నారు. అందులో పంకజ్ త్రిపాఠి, షెఫాలిషా, నవాజుద్దీన్ సిద్దిఖీ, మనోజ్ బాజ్‌పేయి వంటి నటులు ఎంతో మంది ఒక్కసారిగా స్టార్లయిపోయారు.
ఇదీ చూడండి:'స్కామ్ 1992' వెబ్ సిరీస్‌కు ఆ జాబితాలో అగ్రస్థానం