OTT Tollywood Hit movies 2021: కరోనా రాకముందు వరకూ సినిమా అంటే అందరి కళ్లు థియేటర్ల వైపే. కానీ ఈ వైరస్ వల్ల థియేటర్లకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యామ్నాయాలుగా కనిపించాయి. ప్రస్తుతం ఇవి సొంతింటి వెండితెరలా మారిపోయాయి. దీంతో వెండితెరపై వినోదాన్ని పంచాల్సిన పలు సినిమాలు నెట్‌ఫ్లిక్స్, ఆహా, అమెజాన్ ప్రైమ్ సహా పలు డిజిటల్ వేదికల ద్వారా వినోదాన్ని అందిస్తున్నాయి. కొన్ని మూవీస్ తొలుత థియేటర్లో విడుదలై ఆ తర్వాత డిజిటల్ వేదికపై సందడి చేశాయి. అలా ఈ ఏడాది ఓటీటీలో సూపర్‌హిట్‌గా నిలిచిన చిత్రాలేంటో చూసేద్దాం..
Drishyam 2 OTT platform: కమర్షియల్ అంశాల జోలికి పోకుండా కథకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నారు హీరో వెంకటేశ్. పైగా రీమేక్ కథలను రక్తికట్టించడంలో ఆయనది అందెవేసిన చేయి. ఇటీవలే అమెజాన్ వేదికగా ఆయన నటించిన థ్రిల్లర్ మూవీ 'దృశ్యం 2' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో వెంకీ, మీనా, కృతిక, ఏస్తర్ అనిల్, సంపత్ రాజ్, నదియా, నరేశ్, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్, షఫీ కీలక పాత్ర పోషించారు. ఈ మూవీకి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు.
Narappa movie OTT platform: వెంకటేశ్ నటించిన మరో రీమేక్ సినిమా 'నారప్ప'. తమిళ చిత్రానికి రీమేక్ అయినప్పటికీ వెంకీ నటనతో కట్టిపడేశారు. 'నారప్ప'గా వయసుమీరిన పాత్రలో విశ్వరూపం చూపించారనే చెప్పాలి. థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఓటీటీలో విడుదలై విజయం సాధించింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. ప్రియమణి కథానాయిక. అమెజాన్ ప్రైమ్‌లో ఉందీ చిత్రం.
JaiBheem movie OTT platform: ఈ ఏడాది ఓటీటీ వేదికల్లో అనువాద చిత్రాల జోరు బాగానే కనిపించింది. వాటిలో అందరి దృష్టినీ ఆకర్షించినవి తమిళ సినిమాలు 'సార్పట్ట', 'జైభీమ్'. ఈ రెండూ ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదలయ్యాయి. సూర్య నటించిన 'జైభీమ్' సినిమా దేశవ్యాప్తంగా ఓ సంచలనాన్నే సృష్టించింది. పోలీసుల వల్ల అన్యాయానికి గురైన ఓ ఆదివాసీ కుటుంబం కోసం.. చంద్రు అనే ఓ న్యాయవాది చేసిన స్ఫూర్తిదాయక పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. 1995లో తమిళనాడులో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా టి.జె.జ్ఞానవేల్ తెరకెక్కించారు. మనసుల్ని కదిలించే ఇందులోని కథ కథనాలు.. ఆ కథనానికి ప్రాణం పోస్తూ న్యాయవాది చంద్రు పాత్రలో సూర్య ఒదిగిన తీరు.. బాధిత ఆదివాసీలుగా రాజన్న, సినతల్లి పాత్రల్లో మణికందన్, లిజోమోల్ జోసేలు జీవించిన విధానం సినీప్రియులను ఆకట్టుకున్నాయి.
Sarpatta movie OTT platform: ఇక ఆర్య కథానాయకుడిగా పా.రంజిత్ తెరకెక్కించిన క్రీడా నేపథ్య చిత్రం 'సార్పట్ట'. ఎమర్జెన్సీ రోజుల్లో చెన్నై నేపథ్యంగా సాగే కథతో రూపొందించారు. బాక్సింగ్ ఆట చుట్టూ అల్లుకున్న కథకు సామాజిక సమస్యల్ని మేళవిస్తూ రంజిత్ రూపొందించిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
కమర్షియల్, రొమాంటిక్ లవ్‌స్టోరీలతో ఆకట్టుకున్న హీరో నితిన్. ఈ సారి సరికొత్తగా ప్రేక్షకుల ముందుకొచ్చారు. హిందీ సూపర్ హిట్ 'అంధాధున్'కు ఇది రీమేక్. నభా నటేష్ హీరోయిన్. తమన్నా లేడీ విలన్‌గా నటించారు. ఓ హత్య చుట్టూ జరిగే ఈ సినిమా కథలోని మలుపులు వీక్షకులకు ఊపిరాడనివ్వవు. డిస్నీ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉందీ చిత్రం.
ఈ చిత్రాలో పాటు 'సినిమా బండి', 'అరణ్య', 'ప్లే బ్యాక్', 'అద్భుతం', 'ఏక్‌మినీ కథ', 'ఫ్యామిలీ డ్రామా', 'బట్టల రామస్వామి బయోపిక్' కూడా ఓటీటీలో బాగా ఆడాయి.