OTT Release Movies: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు సినిమా షెడ్యూల్స్‌ను తారుమారు చేశాయి. సంక్రాంతికి సందడి చేయాల్సిన పెద్ద సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా కొన్ని చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. వాటితో పాటు, ఓటీటీలోనూ అలరించే చిత్రాలు రెడీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి.
'వర్మ.. వీడు తేడా'
నట్టి క్రాంతి, ముస్కాన్, సుపూర్ణ మలాకర్ నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం 'వర్మ'. వీడు తేడా.. అనేది ఉపశీర్షిక. నట్టి కుమార్ తెరకెక్కిస్తున్నారు. నట్టి కరుణ నిర్మాత. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో జనవరి 21న విడుదల కానుంది. 'ఎంతో హాయిగా సాగిపోతున్న ఓ సాఫ్ట్‌వేర్ కుర్రాడి జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. దాంతో అతని జీవితం ఎలా మారిపోయింది? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న ఆసక్తికర మలుపులతో సినిమా సాగుతుంది' అని చిత్ర బృందం చెబుతోంది. మరి వర్మ కథేంటో చూడాలి.
'ఉనికి' చాటిందా?
ఆశిష్‌గాంధీ కథానాయకుడిగా ఎవర్‌గ్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'ఉనికి'. చిత్రశుక్లా కథానాయిక. రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మాతలు. 'ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ యువతి కష్టపడి చదివి కలెక్టర్ అవుతుంది. సమాజానికి మంచి చేయాలనుకున్న ఆమెకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి తన 'ఉనికి'ని చాటుకుందనేది తెరపైనే చూడాలి.
వినూత్న కథతో 'వధుకట్నం'
శ్రీహర్ష, ప్రియా శ్రీనివాస్, అనన్యా పాణిగ్రహి, జాన్ కుషాల్, రఘు.జి, కవిత శ్రీరంగం, ఆర్యన్ గౌర తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'వధుకట్నం'. భార్గవ గొట్టిముక్కల దర్శకుడు. షేక్‌బాబు సాహేబ్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 21న థియేటర్‌లలో విడుదల కానుంది. 'ప్రస్తుత సమాజంలో మహిళలు ఎన్నో రంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. కానీ, ఇంకా వారి పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. గర్భంలో ఉండగానే ఆడ శిశువుల్ని చంపేస్తున్నారు. ఫలితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది. ఇదిలాగే కొనసాగితే.. పెళ్లి కోసం మగపిల్లలే ఆడపిల్లలకు 'వధుకట్నం' ఇవ్వాల్సి వస్తుందన్న సందేశంతో ఈ సినిమా తెరకెక్కించాం. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!