సినీ రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. ఇప్పడిప్పుడే ఆ కుదుపు నుంచి కోలుకుని షూటింగ్స్ చేస్తున్నారు. అయితే థియేటర్లు ఎప్పుడు తెరుస్తారనేది మాత్రం ఇంకా ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే కొన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. అయితే ఈ వేదిక.. థియేటర్లకు పోటీగా మారుతుందా? ప్రజలు బిగ్స్క్రీన్పై సినిమాలు చూడటం ఇక కష్టమేనా? లాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం వస్తున్నాయి. వాటికి తమదైన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు స్టార్ నటీనటులు. అయితే ఓసారి ఓటీటీ వర్సెస్ థియేటర్ గురించి చూద్దాం.
భౌతిక దూరం, మాస్క్, శానిటైజేషన్ తదితర నిబంధనల నడుమ షూటింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. కరోనా సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్‌తో, అతి కొద్దిమందితో చిత్రీకరణ చేయగలిగిన కథలనే తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. కొందరు మాత్రం ప్రత్యేకంగా ఓటీటీ(ఓవర్ ది టాప్ మీడియా సర్వీసెస్)లో విడుదల చేసేలా సినిమాలు రూపొందిస్తున్నారు. అందుకే నిపుణులు దీన్ని లో-బడ్జెట్ చిత్రాలకు సరైన వేదికలు అని అభిప్రాయపడుతున్నారు.
భారీ వర్సెస్ లోబడ్జెట్
చిన్న సినిమాలు సరైన ధరకు అమ్ముడుకాకపోవడం, విడుదల సమయంలో థియేటర్లు ఖాళీ లేకపోవడం, పెద్ద హీరో సినిమా విడుదల వల్ల ఆయా చిత్రాల విడుదలకే అష్టకష్టాలు పడేవారు. విడుదలైన జనాలు తక్కువగా ఉండే ఏరియాల్లో ప్రదర్శించేవారు. ఫలితంగా వాటికి రీచ్ పరిమితంగా ఉండేది. అలానే ఎన్నో సినిమాలు కథ, కథనం బాగున్నా అండర్ రేటెడ్గానే అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. అయితే వాటిని టీవీలు, యూటూబ్ ఛానెళ్లలో పెట్టినప్పుడు మాత్రం మంచి స్పందన వచ్చేది. ఇప్పుడు ఓటీటీ ఆ సమస్యలన్నింటికి పరిష్కారం చూపిస్తూ.. చిన్న సినిమాలకు వరంగా మారింది. భవిష్యత్తులోనూ వీటికి ఆసరాగా ఈ వేదిక నిలవనుంది. అయితే పెద్ద చిత్రాల విషయంలో ఓటీటీలు ఇది ఆలోచించాల్సిన పరిస్థితి.
దర్శకధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి-1 &2' సినిమాలు దాదాపు రూ.430 కోట్లతో తెరకెక్కాయి. వాటిని ఓటీటీ వేదికలపై విడుదల చేయడం శ్రేయస్కరం కాదు. డిజిటల్ హక్కులకు ఆయా ఓటీటీ సంస్థలు భారీ మొత్తాలను చెల్లించలేవు. వేలమంది సిబ్బంది, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలకు బిగ్ స్క్రీన్ మాత్రమే సరైన మార్గం. లేదంటే నిర్మాతలు నష్టాలు ఎదుర్కొని.. అంతర్జాతీయ హంగులతో సినిమాలు తీయలేరు. ప్రస్తుతం భారత్‌లోనే బాలీవుడ్‌కు పోటీగా ఉన్న టాలీవుడ్ తన స్థాయిని నిలబెట్టుకోవడంలో థియేటర్ల కీలకపాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి పేరు మార్మోగడానికి ఎక్కువ థియేటర్లలో విడుదలవడం ఓ కారణం. అందులో గ్రాఫిక్స్, చిత్రబృందం సృజనాత్మకత మరో కారణం. కచ్చితంగా భారీ బడ్జెట్‌తోనే ఆ స్థాయి విలువలను తీసుకురాగలం.
లాభాలు తగ్గుతాయి!
ఇటీవలె విడుదలైన అమితాబ్ 'గులాబో సితాబో' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థ రూ.60 నుంచి 65 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. అయితే ఈ సినిమా తీయడానికి రూ.30 కోట్లు మాత్రమే ఖర్చయింది. అందువల్ల మరో రూ.30 కోట్లు లాభమే వచ్చింది. అయితే బిగ్బచ్చన్కు ఉన్న క్రేజ్, అతడి ఇమేజ్ను ఆధారంగా.. ఇదే సినిమాను థియేటర్లో విడుదల చేస్తే కచ్చితంగా నిర్మాతకు లాభాలు మరింత పెరిగేవి. తలైవా రజనీకాంత్ 'రోబో 2.ఓ' సినిమా 2018లో విడుదలైంది. ఈ చిత్రానికి రూ.570 కోట్లు ఖర్చుపెడితే.. ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల వసూళ్లు రాబట్టింది. మరి ఓటీటీ వేదికపై కనీసం ఖర్చు పెట్టిందైనా వస్తుందా? అంటే రావని బల్లగుద్ది మరీ చెబుతున్నారు సినీ విశ్లేషకులు. ఓటీటీ వేదికగా అయితే ప్రచారానికి అయ్యే ఖర్చు కాస్త తగ్గుతుంది.
ఆధారం కోల్పోతారు
ఓటీటీ ప్లాట్‌ఫాంలను ఎక్కువగా కార్పోరేట్ సంస్థలే నడిపిస్తున్నాయి. అయితే వీటి నిర్వహణ చాలా తక్కువ వ్యయంతో కూడుకున్నది. అదే థియేటర్ల నిర్వహణకు ఖర్చు ఎక్కువ. వందల సంఖ్యలో సిబ్బంది థియేటర్ల మీద ఆధారపడి జీవిస్తుంటారు. సెక్యూరిటీ, టికెట్ కలెక్టర్, కార్మికులు, ఫుడ్ స్టాల్, థియేటర్ బయట దుకాణాలు ఇలా.. ప్రత్యక్షంగా, పరోక్షంగా వందల మంది ఉపాధి పొందుతారు. ఓటీటీ వల్ల వారందరి భవితవ్యంపై దెబ్బ పడుతుంది. ఇదే జరిగితే ఆదరణ లేక థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు.
స్థాయి తగ్గిపోవచ్చు
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఉన్న ఇబ్బందులకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ఉపయోగపడుతోంది. అయితే ఎంతకాలం ఈ ఫ్లాట్‌ఫామ్ కొత్త కంటెంట్‌ను ఇవ్వగలదు? ఓ సినిమా టాలీవుడ్‌కే చెందుతుంది. లేదంటే పాన్ ఇండియా, వరల్డ్‌వైడ్ అనే విభిన్న వర్గీకరణలు ఓటీటీలో ఉండవు. అప్పుడు సినిమాలు తీసేవాళ్లు ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రాలు తీయాలనేది స్పష్టత ఉండదు.