కథానాయిక అంటే అందాల ఆరబోత కాదు.. అద్భుతమైన నటన అని ఎంతోమంది నాయికలు నిరూపించారు. తమదైన నటనతో వావ్ అనిపించారు. కథానాయకులకు దీటుగా బాక్సాఫీసు వద్ద వసూళ్లు కురిపిస్తున్న నాయికలు ఎందరో ఉన్నారు. ఈసారి ప్రతిష్ఠాత్మక ఆస్కార్ పురస్కారాల రేసులో నిలిచిన ఐదుగురు నాయికలు కూడా తమపాత్రల్లో ఒదిగిపోయినవారే. మరి ఈసారి ఆస్కార్ ఉత్తమ నటి కిరీటం ఎవరికి దక్కుతుందో అనే ఆత్రుత అటు సినిమా తారల్లోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ పెరిగిపోతుంది. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆస్కార్ నామినేషన్ దక్కించుకున్న అతివలు ఎవరు? వాళ్లకు సంబంధించిన విశేషాల ప్రత్యేక కథనం ఇది.
జెస్సికా ఛస్టెయిన్: ‘ఇంటర్‌స్టెల్లర్’లో శాస్త్రవేత్తగా, ‘ది మార్టిన్’లో వ్యోమగామిగా నటించి పాపులర్ అయిన నటి జెస్సికా ఛస్టెయిన్. ఈసారి ఆమె ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. ‘ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫాయే’ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినా ఇందులో టమ్మీ పాత్ర పోషించిన జెస్సికా మంచి పేరు తెచ్చుకుంది. మత ప్రచారకురాలు, గాయని, టీవీ వ్యాఖ్యాత అయిన టమ్మీ ఫాయే పాత్రలో జెస్సికా నటించారు. గతంలో ‘జీరో డార్క్ థర్టీ’ చిత్రం లోని నటనకు ఉత్తమ నటి విభాగంలో నామినేషన్ అందుకున్న జెస్సికా ఈసారైనా ఆస్కార్ దక్కుతుందని ఆశపడుతోంది.
నికోల్ కిడ్‌మన్:ఆస్కార్ ఉత్తమ నటి పురస్కారం అందుకోవడం ఆస్ట్రేలియన్ నటి నికోల్ కిడ్‌మన్‌కు కొత్తేమీ కాదు. 2002లో ‘ది అవర్స్’తో ఉత్తమ నటిగా ఆస్కార్ గెలుచుకున్నారామె. ఇప్పుడు ‘బీయింగ్ ద రికార్డోస్’కు నామినేషన్ దక్కించుకుని రేసులో నిల్చున్నారు. ఒకప్పటి అమెరికన్ సిచ్యుయేషనల్ కామెడీ షో ‘ఐ లవ్ ల్యూసీ’తో పాపులర్ అయిన జంట ల్యూసిల్లే బాల్, దేశీ అర్నాజ్. వీరిద్దరి నిజ జీవితాల నేపథ్యంలో సాగే చిత్రమే ‘బీయింగ్ ద రికార్డోస్’. ఇందులో ల్యూసి పాత్రలో నికోల్ కిడ్‌మన్ నటించి మెప్పించారు. ‘డెడ్ కామ్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకుంది నికోల్. టామ్‌క్రూజ్‌తో కలిసి ఆమె నటించిన ‘డేస్ ఆఫ్ థండర్’ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ‘ఇన్ ఫార్ అండ్ ఎవే’, ‘బ్యాట్‌మెన్ ఫరెవర్’, ‘టు డై ఫర్’, ‘లయన్’ తదితర చిత్రాలు ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టాయి. 1990లో టామ్‌క్రూజ్‌ని పెళ్లి చేసుకున్న ఆమె పదకొండేళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత గాయకుడు కెన్నెత్ అర్బన్‌ను పెళ్లి చేసుకున్నారు. 2020లో టైమ్స్ మ్యాగ్జైన్ ప్రకటించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల’ జాబితాలో చోటు దక్కించుకున్నారు కిడ్‌మన్.
ఒలివీయా కోల్‌మెన్: ఆస్కార్ ఉత్తమ నటిగా మరోసారి పురస్కారం గెలుచుకోవడానికి అవకాశం దక్కించుకుంది ఒలీవియా కోల్‌మెన్. ‘ది ఫేవరెట్’ చిత్రానికి 2019లో ఆస్కార్ ఉత్తమనటి పురస్కారం అందుకొంది. ఈసారి ‘ది లాస్ట్ డాటర్’ చిత్రంలో మధ్య వయస్కురాలైన కాలేజ్ ఫ్రొఫెసర్ లెడా పాత్ర ఆమెకు ఆస్కార్ నామినేషన్ వచ్చేలా చేసింది. లెడా బాధ్యతలకు భయపడి కుటుంబానికి దూరంగా జీవిస్తుంది. భర్త, ఇద్దరు కుమార్తెలను వదిలేసి ఒంటరిగా ఉండే ఆమె కొన్నేళ్ల తర్వాత మరో మహిళ కారణంగా తను ఏం కోల్పోయిందో తెలుసుకుంటుంది. అలాంటి ఓ తల్లి పాత్రలో భిన్నమైన భావోద్వేగాలను పలికించింది ఒలీవియా. కొన్ని భావోద్వేగాలు ప్రదర్శించే విషయంలో ఒలీవియా తేలిపోయిందంటూ కొందరు విమర్శించారు. మరి ఒలీవియా నటనకు ఆస్కార్ వరిస్తుందో లేదో చూడాలి.