"మేం అలసిపోయాం. మాతో పాటు పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అందరూ చాలా అలసిపోయారు. ఇక మా వల్ల కాదు" అంటూ పుదుచ్చేరికి చెందిన జూనియర్ డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి 100 శాతం ప్రేక్షకులకు అనుమతిస్తూ ఇటీవల తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై తన ఫేస్బుక్ వేదికగా పోస్ట్ పెట్టిన డాక్టర్ అరవింద్ శ్రీనివాస్.. ప్రభుత్వానికి ఓపెన్ లెటర్ రాశారు. వందశాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వడం అంటే ఆత్మహత్యాయత్నం కిందకే వస్తుందని అన్నారు.
కరోనా ప్రభావంతో పాటు స్ట్రెయిన్ ముప్పు పొంచి ఉన్న ఈ సమయంలో థియేటర్లకు 100 శాతం అనుమతివ్వడాన్ని కొందరు ఆహ్వానించగా, మరికొందరు తప్పుబడుతున్నారు. అంతమంది ఒకేచోట ఉంటే వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశముందని అంటున్నారు.