తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఓటీటీ వినోదాలు మళ్లీ మొదలు! - బట్టల రామస్వామి బయోపిక్కు ఓటీటీ

కరోనా ఆంక్షలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు మరోసారి సిద్ధమయ్యాయి ఓటీటీలు. ఇటీవలే 'థ్యాంక్ యు బ్రదర్' చిత్రంతో అనసూయ సందడి చేయగా.. అదే బాటలో పలు చిత్రాలు త్వరలోనే రిలీజ్ కానున్నాయి.

Once again OTT releases on spotlight
ఓటీటీ రిలీజ్

By

Published : May 12, 2021, 7:19 AM IST

వెండితెర వినోదాలకు కరోనా సెకండ్‌ వేవ్‌తో మరోమారు కళ్లెం పడింది. తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలల పాటు కళకళలాడిన థియేటర్లన్నీ.. కొత్త బొమ్మల సందడి లేక ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కరోనా ఉద్ధృతి వల్ల వేసవిలో రావాల్సిన పలు చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయి. దీంతో సినీ ప్రియులకు వినోదాల్ని అందించే బాధ్యతను ఓటీటీలు మరోమారు అందిపుచ్చుకున్నాయి. ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా ద్వారా అనసూయ నటించిన 'థ్యాంక్ యు బ్రదర్‌' చిత్రం విడుదలైంది. ఇప్పుడీ బాటలోనే ప్రేక్షకుల్ని అలరించేందుకు దాదాపు అరడజను వరకు చిన్న సినిమాలు సిద్ధమయ్యాయి.

మిల్కీబ్యూటీ 'నవంబర్‌ స్టోరీ'..

ఇటీవలే 'లెవెన్త్‌ అవర్‌' వెబ్‌ సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి తమన్నా. ఇప్పుడు రెండో ప్రయత్నంగా 'నవంబర్‌ స్టోరీ'తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ఇది. తండ్రి హత్య కేసులో ఇరుక్కుంటే.. ఆయన్ను, ఆయన ప్రతిష్ఠను కాపాడుకునే కూతురు పాత్రలో తమన్నా నటించింది. ఈ సిరీస్‌ ఈనెల 20న డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం కానుంది.

అందరి చూపు.. రాధే వైపు..

ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానున్న వాటిలో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం 'రాధే'. సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రభుదేవా దర్శకత్వం వహించారు. దిశా పటానీ కథానాయిక. ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం.. మే 13న థియేటర్లతో పాటు డిజిటల్‌ ఫార్మెట్‌లోనూ ఒకేసారి విడుదలవుతోంది. దీన్ని 'పే పర్ వ్యూ' పద్ధతిలో జీ ఫ్లెక్స్‌ ఓటీటీతో పాటు డీటీహెచ్‌ ఆపరేటర్స్‌ అయిన డిష్‌, డీటూహెచ్‌, టాటా స్కై, ఎయిర్‌టెల్‌ డిజిటిల్‌ టీవీల్లోనూ వీక్షించొచ్చు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో.. సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు సినిమాల సందడి..

ఈవారం ఓటీటీ వేదికగా తెలుగు సినీప్రియులకు ట్రిపుల్‌ ట్రీట్‌ అందనుంది. ప్రముఖ దర్శకులు రాజ్‌ డీకే నిర్మించిన 'సినిమా బండి', దర్శకుడు రామ్‌ నారాయణ్ తెరకెక్కించిన 'బట్టల రామస్వామి బయోపిక్కు', రామ్‌గోపాల్‌ వర్మ 'డీ కంపెనీ' ఈవారంలోనే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ప్రవీణ్‌ కంద్రెగుల దర్శకత్వంలో రూపొందిన 'సినిమా బండి' మే 14న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుండగా.. అదే రోజు జీ5 ఓటీటీలో 'బట్టల రామస్వామి బయోపిక్కు' విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంగా సాగే వినోదాత్మక కథాంశాలతో రూపొందిన ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక వర్మ నుంచి వస్తున్న 'డీ కంపెనీ' మే 15న స్పార్క్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవనుంది. మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌ దావుద్‌ ఇబ్రహీం నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రమిది.

ABOUT THE AUTHOR

...view details