స్టార్ హీరో ప్రభాస్ హీరోగా తీస్తున్న త్రీడీ సినిమా 'ఆదిపురుష్'. ఇందులో రాముడిగా కనిపించనున్నారు డార్లింగ్. ఈ పాత్రకు ప్రభాస్ మాత్రమే న్యాయం చేయగలడని నమ్మానని, అందుకే అతడిని ఎంచుకున్నట్లు దర్శకుడు ఓమ్ రౌత్ చెప్పారు.
"నా దృష్టిలో 'ఆదిపురుష్'గా ప్రభాస్ సరిగ్గా సరిపోతాడనిపించింది. ఈ పాత్రకు ఆయనే న్యాయం చేయగలరు. డార్లింగ్ వ్యక్తిత్వం, ప్రశాంత స్వభావమే ఇందుకు కారణం. అందుకే ఈ సినిమా చేయాలని నిశ్చయించుకున్నా. లేకుంటే ఈ సినిమా ప్రస్తావన కూడా తీసుకొచ్చేవాడిని కాదు"
-ఓమ్ రౌత్, బాలీవుడ్ దర్శకుడు.
వెండితెరపై రాముడి జీవిత చరిత్రను కళ్లకు కట్టినట్లుగా ఆవిష్కరించేందుకు, చిత్రబృందం బాగా కష్టపడుతోందని అన్నారు రౌత్.
"తెరపై ఓ పాత్రను చూపించేటప్పుడు దాని గురించి బాగా పరిశోధన చేయాలి. సాంకేతిక కోణంలోనూ దృష్టి పెట్టాలి. ప్రస్తుతం స్క్రీన్‌ప్లే, పాత్రలను రూపొందించడం, చిత్రనిర్మాణ వ్యయం సహా తదితర అంశాలపై చర్చిస్తున్నాం. ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తాం"
-ఓమ్ రౌత్, బాలీవుడ్ దర్శకుడు
ఈ సినిమాలో కీర్తి సురేశ్, ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తారని ప్రచారం సాగుతోంది. దీనిపై స్పష్టత రావాలి.
ప్రభాస్ 'రాధేశ్యామ్'తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకున్నారు. ఈ రెండూ పూర్తయిన తర్వాతే 'ఆదిపురుష్' షూటింగ్లో పాల్గొనున్నారు 2022లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇది చూడండి ఆయన పంపిన గిఫ్ట్‌కు మెగాస్టార్ చిరు ఫిదా!