ఒక భాషలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న సినిమాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతుంటాయి. కొన్నిచిత్రాల్ని రెండు, మూడు భాషల్లో రీమేక్ చేస్తుంటారు. మహా అయితే నాలుగైదు. కానీ ఓ స్వచ్ఛమైన తెలుగు ప్రేమకథ... టాలీవుడ్ సహా 6 భారతీయ, 2 విదేశీ భాషల తెరలపై సందడి చేసింది. ఇన్ని భాషల్లో రీమేక్ అయిన చిత్రం ఇప్పటి వరకు ఏదీ లేదు. అదే 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'.
ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో... సిద్ధార్థ్, త్రిష నటన ప్రేక్షకులను మైమరపించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం ఈ సినిమా విజయాన్ని మరో మెట్టు ఎక్కించాయి. ఎంఎస్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. 2005, జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమా తమిళ, కన్నడ, ఒడియా, బంగాలీ, పంజాబీ, హిందీ భాషలతోపాటు బంగ్లాదేశ్, నేపాల్‌లోనూ అక్కడి భాషల్లో రీమేక్ అయింది. అత్యధిక భాషల్లో రీమేక్ అయిన తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది. అత్యధిక ఫిలింఫేర్ అవార్డులూ అందుకుంది. ఈ ఆల్‌టైమ్ హిట్ చిత్రానికి 5 నంది అవార్డులు, 9 ఫిలింఫేర్, 2 సంతోషం పురస్కారాలు దక్కాయి.