తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమా వందో రోజైనా టికెట్టు దొరకలేదు'

కొన్ని సినిమాలు మధుర జ్ఞాపకాలు. తరచిచూసుకున్నప్పుడల్లా మనల్ని మనం వెతుక్కుంటున్న అనుభూతి కలుగుతుంది. అంతటి బంధాన్ని, బాంధవ్యాన్ని మనతో అవి పెనవేసుకుపోతాయి. మన హృదయాల్లో చెదరని స్థానాన్ని సంపాదించుకుంటాయి. చెరగని చరిత్రగా శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి సినిమానే 'నువ్వేకావాలి'. ఈ సినిమా విడుదలై అక్టోబరు 13తో 20 ఏళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు మీకోసం.

Nuvve Kavali movie has completed 20 years
సినిమా వందో రోజైనా టికెట్టు దొరకలేదంటే నమ్ముతారా?

By

Published : Oct 12, 2020, 7:28 AM IST

Updated : Oct 12, 2020, 9:26 AM IST

ఓ మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ మాట 'నువ్వే కావాలి' సినిమాతో మరోసారి రుజువైంది. ఈ సినిమా నెలకొల్పిన రికార్డులు, తిరగరాసిన చరిత్ర ఒక్కసారి చూస్తే ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ఇట్టే అర్థమవుతుంది. యువతరం ఓ సినిమాను అక్కున చేర్చుకుంటే అదెంతటి ఘనవిజయం సాధిస్తుందో 'నువ్వే కావాలి' చిత్రం నిరూపించింది. కిక్కిరిసిపోయిన థియేటర్లు, టిక్కెట్ల కోసం గంటల తరబడి పడిగాపులు.. ఇవన్నీ ఏ స్టార్ హీరో ఇమేజ్ లేని ఓ మాములు సినిమాకు సాధ్యమయ్యాయంటే కథలో ఉన్న బలం, నిర్మాణ విలువలు, చిత్రబృందం చేసిన కృషే కారణం.

నువ్వే కావాలి సినిమాకు 20 ఏళ్లు

ఆల్​ టైమ్​ రికార్డు

'నువ్వే కావాలి' విడుదలైన సమయంలో మనం చూస్తున్న సెల్​ఫోన్ విప్లవం లేదు. సినిమాటిక్ ఎక్స్​పీరియన్స్ కావాలంటే థియేటర్​కు వెళ్లాల్సిందే. ఇంటిల్లిపాది మొత్తాన్ని సినిమా హాలుకు రప్పించాలంటే కథలో చాలా బలం ఉండాలి. కుటుంబసమేతంగా చూడగలిగే నిర్మాణ విలువలు ఉండాలి. అవన్నీ సమపాళ్లలో సమకూరాయి కనుకనే 'నువ్వే కావాలి' అంతటి ప్రశంసలు అందుకుంది. తొలుత చాలా తక్కువ థియేటర్లలో, తక్కువ ప్రింట్లతోనే రిలీజైనా.. ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన, మౌత్ పబ్లిసిటీ ఈ సినిమాను శిఖరాగ్రానికి చేర్చాయి.

ఊహించనంత స్థాయిలో థియేటర్లు పెంచాల్సి రావటమే కాదు.. చూస్తుండగానే 50,100,150 అంటూ రోజులు గడుస్తున్నాయే కానీ, సినిమాకు వచ్చే ఆడియన్స్ తగ్గలేదు. అలా అప్పటి వరకూ ఉన్న రికార్డులను బద్దలు కొట్టటమే కాదు.. ఉన్న చరిత్రను తిరగరాసింది 'నువ్వే కావాలి'. ఏకంగా 20 థియేటర్లలో 200 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకున్న తొలి సినిమాగా ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఆరు కేంద్రాల్లో 365 రోజులు ఆడి.. మంచి సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటింది.

కలెక్షన్ల వర్షం

అతి తక్కువ బడ్జెట్‌తో ఉషాకిరణ్ మూవీస్ తెరకెక్కించిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. రామోజీరావు నిర్మాతగా, స్రవంతి రవికిషోర్‌ ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ఈ చిత్రానికి విజయభాస్కర్ దర్శకత్వం వహించగా సంగీత దర్శకుడు కోటి కంపోజ్ చేసిన పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ రాసిన డైలాగులకు థియేటర్లలో చప్పట్లు మార్మోగాయి. సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర రాసిన పాటలు చిరకాలం గుర్తుండిపోతాయి.

ఈటీవీలో ప్రసారం కానున్న 'నువ్వే కావాలి' సినిమా

వందో రోజూ టికెట్టు దొరకలేదు

'నువ్వేకావాలి' తొలుత 22 ప్రింట్లతో మొదలై 110 ప్రింట్స్‌కు చేరటం ఆ రోజుల్లో ఒక సంచలనం. 100వ రోజు థియేటర్ల వద్ద పెద్ద హీరోలకు ఉండే సందడి 'నువ్వేకావాలి' థియేటర్ల వద్ద నెలకొందంటే ఈ సినిమా ఎంత ఆదరణ పొందిందో అర్థం అవుతుంది. చిన్న సెంటర్ల నుంచి పెద్ద సెంటర్ల వరకూ విడుదలై ప్రతి సెంటర్​లోనూ 10 వారాల నుంచి 100 రోజులు ఆడటం అనేది ఇప్పటికీ చెరగని చరిత్ర.

హైదరాబాద్ ఓడియన్ థియేటర్‌ కాంప్లెక్స్​లో 100వరోజు 3 థియేటర్లలోనూ 'నువ్వేకావాలి' చిత్రాన్ని 4 షోలు ప్రదర్శించినప్పుడు ఆరోజూ టికెట్ల దొరక్క జనాలు తిరిగి వెళ్లటం ఒక రికార్డుగా ఇప్పటికీ భావిస్తారు. ఆ రోజుల్లో కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ సెంటర్లలో వారం మాత్రమే కొత్త సినిమాలు వేసేవారు. తొలిసారి 'నువ్వేకావాలి' చిత్రం ద్వారా శివార్లలోని థియేటర్లలోనూ వందరోజులు ఆడిన సినిమాగా జైత్రయాత్ర సాగించింది.

హిందీలో రీమేక్​

'నువ్వేకావాలి' సూపర్‌హిట్‌ చూశాక ఉషాకిరణ్‌మూవీస్ సంస్థ ఇదే చిత్రాన్ని హిందీలో "తుజే మేరీ కసమ్" పేరుతో నిర్మించింది. నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్‌ తనయుడు రితేష్‌ దేశ్‌ముఖ్‌ హీరోగా ఈ చిత్రం ద్వారానే పరిచయం అయ్యారు. జెనీలియా డిసౌజా హీరోయిన్‌గా విడుదల చేసిన ఈ సినిమా హిందీలోనూ విజయాన్ని అందుకుంది.

త్రివిక్రమ్​కు స్టార్​డమ్​ తెచ్చిన చిత్రం

విశేషాభిమానాన్ని చూరగొన్న ఈ చిత్రానికి అనేక అవార్డులు, రివార్డులు వరించాయి. ఉత్తమ చిత్రం పురస్కారంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా విజయ్ భాస్కర్, ఉత్తమ నటుడిగా తరుణ్, ఉత్తమ నటిగా రిచా, ఉత్తమ నేపథ్య గాయకుడిగా శ్రీరామ్ ప్రభుకి.. ఫిల్మ్ ఫేర్- సౌత్ అవార్డులను తెచ్చి పెట్టటం సహా ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా 'నువ్వే కావాలి'.. జాతీయ అవార్డును అందుకోవటం పరిపూర్ణత్వాన్ని తీసుకువచ్చింది.

ఈ సినిమాకు పనిచేసిన యువ బృందమంతా తమ ప్రతిభతో ప్రేక్షకుల మన్ననలు అందుకుని.. సినీ పరిశ్రమలో ఆ తర్వాత అద్భుత కెరీర్​ను నిర్మించుకున్నారు. హీరో తరుణ్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ కష్టానికి ఫలితంగా.. మంచి స్టార్ డమ్​ను 'నువ్వేకావాలి' చిత్రం తెచ్చిపెట్టింది. మంచి చిత్రాలనే నిర్మిస్తుందని ప్రేక్షకుల్లో నిశ్చితమైన అభిప్రాయాన్ని సంపాదించుకున్న ఉషాకిరణ్ మూవీస్ మరోసారి ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ సినీ అభిమానుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

Last Updated : Oct 12, 2020, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details