తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఎన్ని దశాబ్దాలైనా 'నువ్వే కావాలి' ముద్ర చెరగదు

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​ రచయితగా.. విజయ్​ భాస్కర్​ తెరకెక్కించిన యూత్​ఫుల్​ స్టోరీ 'నువ్వే కావాలి'. ఈ సినిమా విడుదలై మంగళవారం (అక్టోబర్ 13) నాటికి రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా 'నువ్వే కావాలి' సినిమకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

Nuvve kavali movie has completed 20 years
రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న 'నువ్వే కావాలి'

By

Published : Oct 10, 2020, 8:18 AM IST

Updated : Oct 10, 2020, 11:18 AM IST

సినిమాలు... మనిషి జీవితాన్ని తెరపై ప్రతిబింబిస్తాయి. మనలోని అంతర్మథనానికి, సంఘర్షణలకు ప్రతీకలుగా నిలుస్తాయి. నవ్విస్తూ....ఏడిపిస్తూ ఓ విడదీయలేని బంధాన్ని పెనవేసుకుంటాయి. అంతటి ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో కొన్ని మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రమే "నువ్వే కావాలి". అనేక నవ్యమైన, నాణ్యమైన చిత్రాలకు చిరునామాగా నిలిచే ఉషాకిరణ్‌ మూవీస్‌... ఈ సినిమాని 21వ శతాబ్దం తొలినాళ్లలో తెరకెక్కించింది. 20ఏళ్ల ప్రయాణం పూర్తైనా.. ఓ పాటగానో, మాటగానో, అంతకుముంచి ఓ మధురానుభూతిగానో ఈ రోజుకీ గుర్తు చేసుకుంటున్నామంటే...తెలుగు ప్రేక్షకుల హదృయాల్లో "నువ్వేకావాలి" ఎంతటి స్థానాన్ని సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు.

ఆకట్టుకొనే చిత్రాలతో 90వ దశకాన్ని విజయవంతంగా దాటేసి.... తెలుగు చిత్రపరిశ్రమ ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ప్రత్యేకమై స్థానాన్ని సంపాదించుకుంటోన్న రోజులు. కమర్షియల్, మాస్ మసాలాలదే రాజ్యం. అదే సమయంలో 6 పాటలు....3 ఫైట్ల ధోరణిపై మెల్లగా ప్రేక్షకుల్లో విసుగు మొదలవుతూ ఉంది. అప్పుడే మార్పునకు, కొత్తదనానికి ఎప్పుడూ పెద్దపీట వేసే ఉషాకిరణ్‌ మూవీస్‌, నూతన శతాబ్దికి ఘనమైన స్వాగతం పలకాలని భావించింది. 1999 చివర్లో మలయాళంలో విడుదలై విజయం సాధించిన "నిరమ్" సినిమా ప్రేరణగా 'నువ్వేకావాలి' చిత్రాన్ని నిర్మించింది. యువతరం ఆలోచనలు, భావోద్వేగాలు, అంతర్మథనం అణువణువునా నిండిపోయిన సున్నితమైన ప్రేమకథ 'నిరమ్'‌ సినిమా. ఆ కథను తెలుగు ప్రేక్షకుల నేటివిటీకి తగినట్టుగా ఉషాకిరణ్‌ మూవీస్‌ అందంగా మలిచింది.

'నువ్వే కావాలి' సినిమాకు 20 ఏళ్లు పూర్తి

త్రివిక్రమ్​ పంచ్​

నువ్వేకావాలి చిత్రంలో కొత్తనీరు తొణికిసలాడుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఫ్రేమ్‌లోనూ నవ్యత కనిపిస్తుంది. స్వయంవరం చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ భాస్కర్‌ను ఈ కథకు కెప్టెన్‌గా ఎంపిక చేసుకున్నారు. స్వయంవరం సినిమాకు పనిచేసి ఆ తర్వాత సొంతూరు భీమవరం వెళ్లిపోయిన యువ రచయితకు ఉషాకిరణ్‌ మూవీస్ నుంచి మళ్లీ రమ్మని కబురు అందింది. తిరిగొచ్చిన అతడు...నీరమ్ సినిమాలోని లైన్ ని మాత్రం తీసుకుని..కథనంలోని యూత్ ఫుల్ నెస్ ఎసెన్స్ ఏ మాత్రం దెబ్బతినకుండా అద్భుతంగా రాశాడు. డైలాగులు, పంచులైన్లు అయితే అదరహో అనేలా కలానికి పదునుపెట్టాడు. అలా 'నువ్వే కావాలి' సంచలన విజయానికి పునాది వేసిన ఆ రచయితే....భవిష్యత్ లో మాటలమాంత్రికుడిగా ప్రేక్షకులను రంజింపజేసే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు.

తారాగణం

కథానాయకుడి కోసం చాలా పేర్లు ప్రతిపాదనకు వచ్చినా...చివరికి నటి రోజారమణి కుమారుడు తరుణ్‌ని..... కథ నువ్వేకావాలని కోరుకుంది. అంతకు పదేళ్ల ముందే ఉషాకిరణ్ మూవీస్ 'మనసు మమత' ద్వారా తరుణ్ బాల నటుడిగా పరిచయమై తొలి చిత్రానికే ఉత్తమ బాల నటుడిగా నంది బహుమతి ఒడిసిపట్టాడు. ఆ తర్వాత మణిరత్నం "అంజలి" చిత్రంతో జాతీయ ఉత్తమ బాలనటుడి అవార్డు అందుకుని తన ప్రతిభ చాటుకున్నాడు. అలా నువ్వేకావాలి కథకు సరిపోయే లక్షణాలున్న హీరో దొరికాడు. సుదీర్ఘ అన్వేషణ తర్వాత రిచా కథానాయికగా ఎంపికైంది. మరో కీలకపాత్రకు గాయకుడు రామకృష్ణ తనయుడు సాయికిరణ్‌ని తీసుకున్నారు. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మాతగా....స్రవంతి రవికిషోర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా నువ్వేకావాలి తెరకెక్కింది. కోటి వీనులవిందైన స్వరాలకు సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర కలాలు తోడై ఉర్రూతలూగించే గీతాలతో నువ్వేకావాలి పాటల పూదోట విరబూసింది.

మొదటి షో నుంచే ప్రభంజనం

తక్కువ ప్రింట్లతో....తక్కువ థియేటర్లలో సరిగ్గా 20ఏళ్ల క్రితం అంటే 13 అక్టోబర్ 2000న విడుదలైన నువ్వేకావాలి.....ప్రభంజనం మొదటిషో నుంచే మొదలైంది. ఆకట్టుకొనే కథనం, అద్భుతమైన పాటలు, అంతకు ముందెన్నడూ వినని పంచ్ డైలాగ్ లు, సంభాషణలు, లవ్ స్టోరీ అన్నీ కలగలసి సినిమాకు సూపర్ హిట్ టాక్ తెచ్చిపెట్టాయి. యువతలో ఎక్కడ చూసినా నువ్వేకావాలి టాపిక్కే. ఎక్కడ చూసినా నువ్వే కావాలి పాటలే తెలుగునాట మార్మోగాయి.

కొన్ని సినిమాలు అన్ని సినిమాల్లాగా కావు. మూస ధోరణులను బద్దలు కొట్టుకుంటూ సరికొత్త దారులను వేస్తాయి. అప్పటివరకూ ఉన్న రికార్డులను తిరగరాయటమే కాదు....భవిష్యత్తు చిత్రాలకు వెలుగులను చూపుతూ మార్గనిర్దేశం చేస్తాయి. అలాంటిదే నువ్వే కావాలి సినిమా. ఇంతటి ఘన విజయం సాధించడం వెనుక కారణాలు అనేకం. 24 క్రాఫ్ట్స్ లో ప్రతి విభాగం పైనా పెట్టిన శ్రద్ధే ఈ సినిమా సృష్టించిన రికార్డులకు మూల కారణంగా చెప్పొచ్చు. కమర్షియల్ సక్సెస్ కోసం మాత్రమే కాకుండా.....మనసుపెట్టి పనిచేస్తే వెతుక్కుంటూ వచ్చే ఫలితాలకు ఎప్పటికీ నిలిచిపోయే బెంచ్ మార్క్ నువ్వేకావాలి.

Last Updated : Oct 10, 2020, 11:18 AM IST

ABOUT THE AUTHOR

...view details