'నువ్వులేక నేనులేను', 'నువ్వే.. నువ్వే', 'ఎలా చెప్పను', 'ప్రియమైన నీకు' వంటి ఎన్నో సూపర్ డూపర్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు హీరో తరుణ్. ఆయన ఉషా కిరణ్ మూవీస్ సంస్థలో విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'నువ్వే కావాలి'లో నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 13తో 20 ఏళ్లు పూర్తి చేసుకోనుంది.
హీరోగా సినిమా ప్రపంచంలోకి అప్పుడప్పుడే అడుగులు వేస్తున్న తరుణ్‌కు ఓ గొప్ప విజయాన్ని అందించింది 'నువ్వే కావాలి'. కాలేజీ చదువులు, స్నేహం విలువ, నైతికత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటీనటుల పాత్రాభినయం ఒకెత్తయితే... సంగీతం మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ సినిమా అక్టోబర్ 13కు 20ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు కోటి.. ఈ చిత్రం గురించి కొన్ని విషయాలు పంచుకున్నారు.
"నువ్వే కావాలి' చిత్రాన్ని రామోజీరావు, స్రవంతి రవికిశోర్.. ఈ రెండు సంస్థలు కలిసి తక్కువ బడ్జెట్లో చిత్రీకరించి తెరకెక్కించారు. చిన్న కథను తీసుకుని దర్శకుడిగా విజయ్ భాస్కర్, రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా మంచి బృందంతో నన్ను నేను నిరూపించుకోవడానికి చక్కటి అవకాశం అందించారు. మిలీనియం (2000) సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రానికి సంగీతంలో కొత్త ట్రెండ్ సృష్టించాలనే ఉద్దేశంతో కొత్తగా ప్రయత్నించా. దీంతో మంచి విజయం సాధించింది. ముఖ్యంగా యువతకు ఇందులోని పాటలు బాగా రీచ్ అయ్యాయి."