చిన్న వయసులోనే నిర్మాతగా మారిన అశ్వనీదత్ ఎన్టీఆర్‌కి వీరాభిమాని. అందుకే వైజయంతీ మూవీస్ తొలి సమర్పణగా ఎన్టీఆర్‌తో 'ఎదురులేని మనిషి' నిర్మించారు. 1976లో విడుదలై 100 రోజుల పండుగ చేసుకున్న ఆ చిత్రం ఎన్టీఆర్ గెటప్‌ను మార్చేసింది. అందులోని ఆయన కాస్ట్యూమ్స్, విగ్, బాడీ లాంగ్వేజ్, స్టెప్స్ లాంటివి మరో ఇన్నింగ్స్‌కు పునాదులు వేశాయి. దీంతో అభిమానుల్లో ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఎన్టీఆర్ రిటైరయ్యే వరకు ఆ గెటప్ కొనసాగింది.
'ఎదురులేని మనిషి' చిత్రీకరణ 'కసిగా ఉంది...' పాటతో మొదలైంది. షూటింగ్‌కి వచ్చిన ఎన్టీఆర్ ఆ పాట వింటూనే అశ్వనీదత్‌ను పిలిపించి 'నేను ఈ పాటకు డ్యాన్స్ చేయాలా' అని అడిగారట. అశ్వనీదత్ సిగ్గుతో తలవంచుకుని "సార్ నేను మీ అభిమానిని. నా అభిమాన నటుడు ఎలా ఉండాలో... ఏ గెటప్‌లో కనిపిస్తే బాగుంటుందో నాలో కొన్ని ఆలోచనలున్నాయి. వాటి ప్రకారం కథ తయారు చేసుకుని మిమ్మల్ని ఇలా చూపించదల్చుకున్నా. నాలాంటి అభిమానులు మీకు ఎంతో మంది ఉన్నారు. వారంతా తప్పకుండా ఈ కొత్తదనాన్ని ఆహ్వానిస్తారు" అన్నారట.