తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తారక్​తో అలా.. చెర్రీతో ఇలా.. 'ఆర్ఆర్ఆర్' కాంబినేషన్లు అదుర్స్! - ntr charan rajamouli combo

RRR Movie: ఎన్టీఆర్​, రామ్​చరణ్​ల​తో సినిమా తీసి గతంలోనే రికార్డులు సృష్టించిన జక్కన్న 'ఆర్​ఆర్​ఆర్​' మరోసారి జతకట్టారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం కావడం వల్ల యావత్​ సినీ అభిమానులు 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు నటించిన పాత చిత్రాలు, వాటి రికార్డుల గురించి ఓసారి చూద్దాం.

RRR Movie
RRR Movie

By

Published : Mar 23, 2022, 8:31 AM IST

RRR Movie: 'రౌద్రం రణం రుధిరం' (RRR) చిత్రంపై దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా యావత్‌ సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ పాన్‌ ఇండియా చిత్రం మార్చి 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆర్‌-ఆర్‌- ఆర్‌ కాంబినేషన్లను ఓసారి గుర్తుచేసుకుందాం..

నంబరు 1 గా..

'స్టూడెంట్‌ నెం. 1'లో ఎన్టీఆర్​

ఓ ప్రముఖ ధారావాహికతో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన రాజమౌళి 'స్టూడెంట్‌ నెం. 1' చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. హీరోగా ఎన్టీఆర్‌కు ఇది రెండో సినిమా. 2001 సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుమారు రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.12 కోట్ల వసూళ్లు సాధించి, రాజమౌళి- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌కు క్రేజ్‌ తీసుకొచ్చింది. చేయని నేరానికి జైలుపాలైనా.. చదువును అశ్రద్ధ చేయకుండా లాయరు కావాలనే తన తండ్రి కలను నిజం చేసిన ఓ విద్యార్థి కథ ఇది. ఆదిత్య పాత్రలో ఎన్టీఆర్‌ నటన అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దర్శకుడిగా రాజమౌళికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం 73 కేంద్రాల్లో 50 రోజులు, 42 కేంద్రాల్లో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శితమైందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.

మళ్లీ ఎన్టీఆర్‌తోనే..

'సింహాద్రి'లో ఎన్టీఆర్​

రాజమౌళి తన ద్వితీయ ప్రయత్నం ఎన్టీఆర్‌తోనే చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా 'సింహాద్రి' ప్రభంజనం సృష్టించింది. 2003 జులై 9న విడుదలైన ఈ సినిమా ఎన్టీఆర్‌ కెరీర్‌ను ఓ మలుపు తిప్పింది. ఈ చిత్రంలో సింహాద్రి, సింగమలైగా ఎన్టీఆర్‌ నట విశ్వరూపం చూపారు. ఆయన నటనే కాదు విలన్లను వేటాడేందుకు వినియోగించిన ఆయుధం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. 'రాజమౌళి సినిమాల్లోని హీరోలు వాడే ఆయుధాలు విభిన్నంగా ఉంటాయి' అని ప్రేక్షకులు చర్చించుకోవడం ఈ చిత్రంతోనే మొదలైంది. సుమారు రూ. 6 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ ప్రాజెక్టు రూ. 46 కోట్ల వసూళ్లు రాబట్టిందనేది సినీ విశ్లేషకుల మాట.

అంతకుమించి..

'యమదొంగ'లో ఎన్టీఆర్​

రాజమౌళి- ఎన్టీఆర్‌ కలిసి పనిచేసిన మూడో చిత్రం 'యమదొంగ'. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచింది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాలకు మించి వసూళ్లు రాబట్టి అటు ఎన్టీఆర్‌, ఇటు రాజమౌళి స్థాయిని మరింత పెంచింది. అప్పటి వరకూ కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్‌ ఈ సినిమా కోసం కసరత్తులు చేసి నాజుగ్గా తయారయ్యారు. ఈ సినిమాలోని ఎన్టీఆర్‌ లుక్‌ను చూడగానే అందరూ సర్‌ప్రైజ్‌ అయ్యారు. ఎన్టీఆర్‌.. రాజా అనే పాత్రలో నవ్వులు పంచి, ఎమోషన్‌తో కట్టిపడేశారు. ఈ సినిమా 2007 ఆగస్టు 15న విడుదలైంది.

రికార్డుల మగధీర

'మగధీర'లో రామ్​చరణ్​

'చిరుత' సినిమాతో తెరంగేట్రం చేసిన రామ్‌చరణ్‌ హీరోగా రాజమౌళి 'మగధీర'ను తెరకెక్కించారు. గత జన్మల నేపథ్యంలో రూపొందిన ఈ భారీ బడ్జెట్‌ చిత్రం ప్రేక్షకులను ఓ కొత్త లోకానికి తీసుకెళ్లింది. ఈ విజువల్‌ వండర్‌ అప్పటి వరకూ ఉన్న తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాసింది. కాలభైరవ, హర్షగా రామ్‌చరణ్‌ ఒదిగిన తీరు.. రాజమౌళి టేకింగ్‌ ప్రేక్షకుల్ని అబ్బురపరిచాయి. 2009 జులై 31న ఈ సినిమా విడుదలైంది.

ఇప్పుడు ఇద్దరితో..

'ఆర్​ఆర్​ఆర్​' పోస్టర్​

రాజమౌళి.. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో తారక్‌, చరణ్‌ను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నారు. అల్లూరి సీతారామరాజు (నిప్పు), కొమురం భీమ్‌ (నీరు)ల స్నేహం గురించి తెలియజేయనున్నారు. 1920లో సాగే ఈ చిత్రం సుమారు రూ. 400 కోట్లతో రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్నాయి. రాజమౌళి- ఎన్టీఆర్‌ కాంబోలో తెరకెక్కిన 4వ సినిమాగా, రాజమౌళి- రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో రూపొందిన 2వ చిత్రంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినీ ప్రియుల్ని ఊరిస్తోంది.

ఓ వైపు నాన్న.. మరోవైపు పెద్దన్న..

కీరవాణి-విజయేంద్ర ప్రసాద్​

రాజమౌళి చిత్రాల కథలు ఎంతగా మెప్పిస్తాయో, సంగీతం, నేపథ్య సంగీతం (బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌) అదే స్థాయిలో అలరిస్తుంటాయి. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌తో తెరకెక్కించిన సినిమాలకే కాదు రాజమౌళి దర్శకత్వం వహించిన ప్రతి చిత్రానికి ఆయన సోదరుడు కీరవాణినే స్వరాలందించారు. విభిన్న ట్యూన్లతో శ్రోతల్ని ఓలలాడించారు. పలు సినిమాల నేపథ్య సంగీతంతో రోమాలు నిక్కబొడిచేలా చేశారు. 'స్టూడెంట్‌ నం.1', 'మర్యాద రామన్న', 'ఈగ' మినహా రాజమౌళి చిత్రాలన్నింటికీ తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ అందించారు. 'ఆర్‌ఆర్‌ఆర్‌'తో మరోసారి అలరించనున్నారు.

ఇదీ చదవండి:Rrr: ఆర్ఆర్ఆర్​పై భారీ అంచనాలు.. బాహుబలి రికార్డులు బద్దలయ్యేనా..!

ABOUT THE AUTHOR

...view details