హీరో అంటే స్టైల్‌గా కనిపించాలి. ఫైట్లు చేయాలి లాంటివి చాలా సినిమాల్లో చూస్తుంటాం. కానీ కొన్నిసార్లు మన కథానాయకులు, విభిన్న పాత్రలతో మెప్పిస్తుంటారు. అయితే నందమూరి తారక రామరావు ఇలాంటి సాహసాన్ని చాలా ఏళ్ల క్రితమే చేశారు. ఓ పాత్ర కోసం ఏకంగా డీగ్లామరైజ్‌గా కనిపించి, ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచారు. ఆయన జయంతి(మే28) సందర్భంగా ఆ విశేషాలు మీకోసం.
1954లో వచ్చిన 'రాజు- పేద' సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేశారు. రాజులా, పోలిగాడు అనే దొంగ పాత్రలో నటించారు. మాములుగా ఏ హీరో కూడా ఇలాంటి పాత్ర చేయడానికి అప్పట్లో సాహసించరు. కానీ ఎన్టీఆర్ ఒప్పుకొన్నారు. అందరూ షాకయ్యారు. ఎందుకంటే ఆ పాత్ర కోసం గోనెగుడ్డలు ధరించాలి, మొహమంతా మసి పూసుకోవాలి. దానికి తోడు ప్రతినాయక ఛాయలు. అయినా సరే ఎన్టీఆర్ తాను చేస్తానని ముందుకొచ్చారు. ఎందుకంటే దర్శకుడు బీఏ సుబ్బారావుపై ఆయనకు విపరీతమైన గౌరవం. దానికితోడు ఇలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలనే కసి మరోవైపు.