2017లో టాలీవుడ్లో కలకలం రేపిన మత్తుమందుల కేసు ఇప్పటీకీ కొనసాగుతూనే ఉంది. ఆబ్కారీ అధికారులు నాలుగేళ్లు దర్యాప్తు జరిపి... చివరకు ఏమీ లేదని తేల్చడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు రేకెత్తాయి. ఇప్పుడు ఈడీ దర్యాప్తు కూడా అలాగే ముగిసే పరిస్థితులు కనిపిస్తుండటం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
మత్తుమందుల సరఫరాలో ప్రధాన సూత్రధారి కెల్విన్‌తో టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలపై ఆబ్కారీశాఖ గతంలో దర్యాప్తు జరిపినప్పుడు తాను చాలామందికి డ్రగ్స్ అందజేసేవాడినని చెప్పాడు. ఆ వాంగ్మూలం ఆధారంగా వారందర్నీ పిలిచి విచారించారు. కానీ కెల్విన్ వారికి మత్తుమందులు సరఫరా చేసినట్లు కాని, వారు వాటిని వాడినట్లు కాని ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయారు. చివరికి వారి రక్తం, గోళ్లు, వెంట్రుకల వంటి నమూనాలను విశ్లేషించినా మాదకద్రవ్యాల వినియోగంపై వీసమెత్తు ఆధారం కూడా లభించలేదు. దాంతో ఈ కేసులో టాలీవుడ్ ప్రముఖుల పాత్రలేదని తేల్చేశారు. కేవలం డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ కెల్విన్ ముఠాపైనే అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఇప్పుడు ఇదే కేసులో కెల్విన్ ముఠాకు, టాలీవుడ్ ప్రముఖులకు మధ్య జరిగిన నిధుల బదిలీపై ఈడీ దృష్టి సారించింది.