బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్‌తో 'గులామ్' సినిమాలో కలిసి నటించిన జావేద్ హైదర్.. ప్రస్తుతం ముంబయి వీధుల్లో కూరగాయలు అమ్ముకుంటున్నాడని ప్రచారం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియోను బిగ్‌బాస్ ఫేమ్ డాలీ బింద్రా తన ట్విట్టర్లలో పంచుకుంది. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించాడు జావేద్ హైదర్. ఆ టిక్‌టాక్ వీడియో కేవలం సరదా కోసం చేసిందని స్పష్టం చేశాడు.
"నేను కూరగాయలు అమ్మే వాడ్ని కాదు. ఇంకా నటుడిగానే కొనసాగుతున్నా. టిక్‌టాక్‌లో నా అనుచరులను ప్రోత్సహించడానికి ఆ విధంగా చేశా. కష్టకాలంలో దేన్నీ వదులుకోవద్దని సందేశాన్నిచ్చే విధంగా అందులో నటించా. కానీ, కూరగాయలు అమ్ముతున్నట్లు ప్రచారం జరుగుతుందని నేను అనుకోలేదు. డాలీ బింద్రా తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో నా టిక్‌టాక్ వీడియో పోస్టు చేశారు. నేను కేవలం అందులో నటించా. ఈ విధంగా వైరల్‌గా మారుతుందని నేను అనుకోలేదు".