బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నటించిన సూపర్‌హిట్ చిత్రం 'డాన్'. అమితాబ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా 1978 మే 12న విడుదలైంది. నేటితో 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాంబే అండర్ వరల్డ్ డాన్‌గానూ, విజయ్ అనే పాత్రలలో నటించి ప్రేక్షకులను అలరించారు బిగ్ బీ. అయితే ఈ ప్రత్యేకమైన రోజున దానికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు అమితాబ్.
"డాన్' సినిమా దర్శకుడు చంద్ర బరోత్, రచయిత సలీమ్ జావేద్‌లు టైటిల్ ప్రకటించిన తర్వాత పంపిణీదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఆ సమయంలో ప్రసిద్ధ బ్రాండైన డాన్ లోదుస్తుల పేరు పెడుతున్నామని వారంతా భావించారు. 'డాన్' అనే పదానికి అర్థం అప్పటివరకు అంతగా ఎవరికి తెలియదు. ఈ సినిమాలో పాపులరైన 'కైకే పాన్ బనారస్' పాటకు స్టెప్పులను నా కొడుకు అభిషేక్ దగ్గర నేర్చుకున్నా. ఆ పాట విన్న తర్వాత అభిషేక్ వేసిన మూమెంట్లను నేను వేస్తూ అందులో నటించాను. నిర్మాత నారీమన్ ఇరానీ.. ఈ చిత్ర విడుదలకు ముందే మృతి చెందటం బాధ కలిగించింది".