బలమైన నాయికా ప్రాధాన్య పాత్రలు ఎంచుకుంటూ.. తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నివేదా పేతురాజ్. అందం.. అభినయాలతో సినీప్రియుల గుండెల్లో కలల రాణిగా వెలుగొందుతోంది. ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను.. తన ఇష్టాఇష్టాలను 'వసుంధర'తో ప్రత్యేకంగా పంచుకుందిలా..
నేను పుట్టింది తమిళనాడులోని మధురైలోనైనా.. పెరిగిందంతా దుబాయ్‌లోనే. చదువంతా అక్కడే సాగింది. నాన్న పేతురాజ్. ఇంజినీర్. అమ్మ భవాని. గృహిణి. నాకు ఐదేళ్లున్నప్పుడు నాన్న దుబాయ్ వెళ్లిపోయారు. తర్వాత ఆరేళ్ల పాటు అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండిపోయాం. ఆ సమయంలో ఇంట్లో తాతతో బయట స్నేహితులతో జీవితం చాలా సరదాగా గడిచిపోయింది. 11 ఏళ్ల వయసులో మేమూ దుబాయ్ వెళ్లిపోయాం. అక్కడే మేనేజ్‌మెంట్ డిగ్రీ చేశా. నేనిప్పటి వరకు చేసినవన్నీ సీరియస్‌గా సాగే పాత్రలే. బయటా అలాగే ఉంటానేమో అనుకుంటుంటారు. నిజానికి నేను చాలా సరదా మనిషిని.
అనుకోకుండా..
నేను నటిని అవ్వాలని అనుకోలేదు. ఊహించని విధంగా చిత్రసీమలోకి అడుగుపెట్టా. పరిశ్రమలోకి రాకముందు దుబాయ్‌లో కొన్నాళ్లు కార్ల కంపెనీల్లో పనిచేశా. ఈవెంట్లు చేశా. బొటిక్స్ నడిపా. ఆ సమయంలో చాలా మంది 'బాలీవుడ్ నటిలా ఉన్నావు.. సినిమాల్లో ప్రయత్నించొచ్చుగా' అని అంటుండే వారు. ఆ మాటలన్నీ బుర్రలో నాటుకుపోయాయి. అలా 19 ఏళ్ల వయసులో సరదాగా కొన్ని షూట్స్‌లో పాల్గొన్నా. ఆ ఫొటోల వల్ల తెలుగులో ఓ సినిమా అవకాశమొచ్చింది. అమ్మా నాన్నకి చెబితే.. 'మనకివన్నీ అవసరమా.. మాకైతే ఇష్టం లేదు' అనేశారు. 23 ఏళ్లవయసులో మిస్ ఇండియా ఆఫ్ యూఏఈ పోటీల్లో విజయం సాధించా. అది చూశాక 'సినిమాల్లోకి వెళ్లాలనుకుంటే వెళ్లు..' అన్నారు. వెంటనే తమిళం నుంచి ఓ ఆఫర్. అదే 'ఒరు నా కూత్తు' (2016). ఆ మరుసటి ఏడాదే వివేక్ ఆత్రేయ 'మెంటల్ మదిలో' సినిమాతో నన్ను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ రెండు చిత్రాలూ నాకు మంచి పేరు తీసుకువచ్చాయి. దీంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
సినిమా ఇష్టం.. అదే జీవితం కాదు
నాకు సినిమాలంటే ఇష్టం. అంతేకానీ.. అదే జీవితమనైతే అనుకోవట్లేదు. లైఫ్‌లో నా గోల్స్ చాలా ఉన్నాయి. ఒకటే లక్ష్యంగా పెట్టుకుంటే.. అది సాధించలేని రోజున ఒత్తిడికి లోనవ్వాల్సి వస్తుంది. అందుకే అలా ఉండాలనుకోను. ఇండస్ట్రీలో నాకు మరొకరు పోటీ అని నేనెప్పుడూ అనుకోను. ప్రతి ఏడాదీ ఎంతో మంది కొత్త తారలు వస్తుంటారు.. వెళ్తుంటారు. అది ఓ చక్రం. ఎవరి ప్రతిభ వారిదే. ఇలాంటి పాత్రలతో మెప్పించాలి.. ఇన్నేళ్లు కొనసాగాలనే ప్రత్యేక లక్ష్యాలేమీ లేవు. ఉన్నంత కాలం ఓ ఇమేజ్ చట్రంలో బందీ అవకుండా.. విభిన్న పాత్రలతో ప్రేక్షకుల్ని మెప్పించగలిగితే చాలు.
రేసింగ్‌లో రయ్.. రయ్..
సినిమాలు కాకుండా ప్రస్తుతం నా దృష్టి మరేదైనా విషయంపైనా ఉందీ అంటే.. అది రేసింగ్‌పైనే. నాకు చిన్నతనం నుంచి రేసింగ్ అంటే ఇష్టం. 2015లోనే డాడ్జ్ ఛాలెంజర్ స్పోర్ట్స్ కారు కొన్నా. దాన్ని బాగానే నడిపా. చెన్నై వచ్చాక కొన్ని మోటర్ ట్రాక్స్ చూశా. తర్వాత కోయంబత్తూరులోని ఓ రేసింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకున్నా. ప్రస్తుతం లెవల్-1 పూర్తిచేశా. ఇక లెవల్-2 పూర్తి చేయడంపై దృష్టిపెట్టా.
ఏం జరిగినా.. మన మంచికే..
ఎంతటి కఠిన పరిస్థితులెదురైనా సానుకూలంగానే స్వీకరిస్తా. కొన్నిసార్లు ఊహకందనంత విషాదాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. 'నాకే ఎందుకిలా' అనైతే కూర్చోను. ప్రతి దెబ్బా ఓ గొప్ప పాఠం నేర్పుతుంది. మరింత దృఢమైన వ్యక్తిగా మారుస్తుంది. ప్రతి చెడు వెనుక ఓ మంచి ఉంటుందనే విశ్వసిస్తా. నా జీవితంలో ఎదురైన సవాళ్లలో.. మర్చిపోలేని సంఘటన ఒకటుంది. దుబాయ్‌లో ఉద్యోగం చేసే రోజుల్లో.. ఒకే నెలలో ఐదుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. ప్రతిదీ ఎదుటి వాళ్ల పొరపాటు వల్ల జరిగినదే. ఓసారి నా కారు పూర్తిగా దెబ్బతింది. ఆ జాబ్ కలిసి రావట్లేదని అర్థమై.. మరోటి వెతుక్కున్నా.