"నేనెప్పుడూ ఏ పాత్రను ఛాలెంజింగ్ అనుకోను. అలా అనుకుంటే అబ్బో చాలా కష్టపడ్డానేమో అనిపిస్తుంది. అందుకే ఏ పాత్రనైనా ఎంజాయ్ చేస్తూనే చేస్తా. కథ వింటున్నప్పుడే నేను నా పాత్రలోకి లీనమైపోతా" అని నటి నిత్యామేనన్ అంటోంది.
వైవిధ్యభరిత కథా చిత్రాలకు చిరునామాగా నిలిచే ఆమె.. ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం 'స్కైలాబ్'. విశ్వక్ ఖండేరావు తెరకెక్కించారు. సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది నిత్యామేనన్. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..
ఈ కథని తొలుత నటిగా విన్నారా? నిర్మాతగా విన్నారా?
ముంబయిలో ఉన్నప్పుడు విశ్వక్ నాకు ఈ కథ చెప్పారు. ఇంటర్వెల్ వరకు వినగానే.. ఈ సినిమా నేను చేస్తానని చెప్పాను. తొలుత ఈ కథను నేను నటిగానే విన్నా. అయితే ఇలాంటి చిత్రాలు తెరపైకి రావడం అనుకున్నంత ఈజీ కాదు. నిర్మాణ పరంగా కొన్ని అవరోధాలు ఎదురవుతుంటాయి. అలాంటి కొన్ని సమస్యలు ఎదురైనప్పుడే ఈ చిత్రానికి సహాయ పడాలనిపించింది. ఈ క్రమంలోనే అనుకోకుండా నిర్మాతగా మారా. మంచి కథా బలమున్న స్క్రిప్ట్ ఇది. ఇలాంటి స్క్రిప్ట్ వింటే ఎవరైనా ఎగ్జైట్ అవ్వాల్సిందే. దీన్ని దర్శకుడు తెరకెక్కించిన విధానం చాలా కొత్తగా ఉంటుంది. తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతంలో జరిగే కథయినా.. ఎక్కడా రా లుక్ ఉండదు. చాలా పాలిష్ లుక్ కనిపిస్తుంటుంది. మంచి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్ వినిపిస్తుంటుంది. తెరపై కనిపించే కలర్స్, విజువల్స్.. ప్రతిదీ చాలా విభిన్నంగా ఉంటాయి.
ఇంతకీ స్కైలాబ్ కథేంటి? ఈ చిత్రం చేయడానికి ముందు స్కైలాబ్ గురించి ఏమైనా కథలు విన్నారా?
తెలంగాణలోని బండలింగపల్లి అనే గ్రామం నేపథ్యంలో సాగే కథ ఇది. ప్రధానంగా మూడు పాత్రల చుట్టూనే కథంతా తిరుగుతుంటుంది. వాటిలో రెండు పాత్రల్ని సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ పోషించగా.. మరో పాత్రలో నేను నటించా. నేనిందులో జర్నలిస్ట్ గౌరమ్మగా కనిపిస్తా. మా ముగ్గురికి వేరు వేరు లక్ష్యాలుంటాయి. అయితే స్కైలాబ్ వల్ల మా జీవితాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటి? దాని వల్ల మాకెదురైన సమస్యలేంటి? అన్నది తెరపై చూడాలి.