రివ్యూ: 'రంగ్‌దే' సినిమా ఎలా ఉందంటే? - నితిన్ కీర్తి సురేష్
నితిన్ హీరోగా తెరకెక్కిన 'చెక్' విడుదలైన సరిగ్గా నెల తర్వాత ఆయన నటించిన 'రంగ్‌దే' చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? నితిన్, కీర్తి సురేశ్ నటన మెప్పించిందా? సితారా బ్యానర్లో హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడా? తెలుసుకోవాలంటే ఈ సమీక్ష చదవాల్సిందే!
ప్రేమకథల్లో నితిన్ చక్కగా ఒదిగిపోతుంటారు. అందుకే కెరీర్ ఆరంభమై 19 ఏళ్లయినా ఇప్పటికీ ప్రేమకథలు చేస్తూనే ఉన్నారు. యువ దర్శకుడు వెంకీ అట్లూరికి కూడా ప్రేమకథలపై మంచి పట్టుంది. ఆయన మూడో చిత్రంగా 'రంగ్ దే' తెరకెక్కింది. ఇదే నా ఆఖరి ప్రేమకథ అవుతుందని నితిన్ ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో చెబుతూ వచ్చారు. నితిన్‌కి జోడీగా కీర్తిసురేశ్ నటించడం.. ప్రచార చిత్రాలు ఆకట్టుకునేలా ఉండటం.. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం బాధ్యతలు నిర్వర్తించడం వల్ల ఈ సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి. మరి 'చెక్' తర్వాత నితిన్ నుంచి వచ్చిన 'రంగ్ దే' ఎలా ఉంది? నితిన్-కీర్తి జోడీ ఎలా మెప్పించింది?
కథేంటంటే?
అర్జున్ (నితిన్), అనుపమ (కీర్తిసురేష్) పక్కపక్క ఇళ్లల్లో పెరిగారు. చిన్నప్పట్నుంచి ఒకరికొకరు బాగా తెలుసు. అను చదువుల్లో చురుకు. అర్జునేమో ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌లతో సతమతమవుతుంటాడు. 'అనుని చూసి నేర్చుకో' అంటూ అర్జున్ తండ్రి (నరేశ్) చివాట్లు పెడుతూనే ఉంటాడు. ఆ చివాట్లు విన్న ప్రతిసారీ అనుపై కోపంతో రగిలిపోతుంటాడు అర్జున్. ఒక శత్రువులా చూస్తుంటాడు. అలాంటి శత్రువుని అనుకోకుండా అర్జున్ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది? ఎందుకలా జరిగింది? ఇష్టం లేని పెళ్లి తర్వాత వాళ్ల కాపురం సజావుగా సాగిందా లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
పొరుగింటి అమ్మాయి అబ్బాయి మధ్య గిల్లికజ్జాలు, స్నేహం, ప్రేమ నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. ఇది కూడా వాటికి భిన్నమైన కథేమీ కాదు. కాకపోతే ఇందులో పెళ్లి కథ కూడా ఉంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఒక అబ్బాయి ఆ తర్వాత ఎలా ప్రేమని వెదుక్కున్నాడనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. అర్జున్, అనుల గిల్లికజ్జాలు, వాళ్ల కుటుంబ నేపథ్యంలో ప్రథమార్ధం సరదాగా సాగుతుంది.
అర్జున్ అతని స్నేహ బృందం కలిసి చేసిన అల్లరి నవ్వించింది. ఇంజినీరింగ్ గట్టెక్కేందుకు చేసే ప్రయత్నాలు, జీమ్యాట్ కోసం బ్రహ్మాజీని ఆశ్రయించిన తర్వాత సన్నివేశాలు చక్కటి వినోదాన్ని పంచుతాయి. విరామం సమయంలో వచ్చే మలుపు సినిమాను మరింత ఆసక్తికరంగా మార్చేస్తుంది. ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే పెళ్లి చేసుకున్నానని అను చెప్పే సన్నివేశాలు మరో ఎత్తు.
ద్వితీయార్ధంలో కథ దుబాయ్‌కి మారిపోతుంది. చదువుకోసం అక్కడికి వెళ్లిన భార్యాభర్తల మధ్య గొడవలు, విడిపోవాలని నిర్ణయించుకోవడం, ఆ నేపథ్యంలో సంఘర్షణ భావోద్వేగాల్ని పంచుతుంది. అప్పటిదాకా ఇష్టం లేనట్టుగానే వ్యవహరించిన అర్జున్ ఉన్నట్టుండి పతాక సన్నివేశాల్లో మనసు మార్చుకోవడం అంతగా అతకలేదనిపించినా ఈ కథకు అంతకుమించి ముగింపు కష్టమే. వెన్నెల కిషోర్ ద్వితీయార్ధంలో అక్కడక్కడా నవ్వించారు. తెలిసిన కథే అయినా ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా కుటుంబ వినోదం ఉండటం, మంచి జోడీ, ఆహ్లారదరకమైన సన్నివేశాలతో సినిమా కాలక్షేపం చేయిస్తుంది.
ఎవరెలా చేశారంటే?
నితిన్ - కీర్తి జోడీ ఈ సినిమాకు కొత్త రంగులద్దింది. ఇద్దరికీ అలవాటైన పాత్రలే. మంచి కెమిస్ట్రీ పండించారు. అర్జున్ అనే ఇంజినీరింగ్ కుర్రాడిగా నితిన్ యంగ్ లుక్‌లో కనిపించిన తీరు మెప్పిస్తుంది. కీర్తి నాజూగ్గా మారినా అందం తగ్గలేదు. అదంతా పీసీ శ్రీరామ్ కెమెరా చలవే. హీరో తండ్రిగా నరేశ్, హీరోయిన్ తల్లిగా రోహిణి బలమైన పాత్రల్లో కనిపిస్తారు.
అభినవ్ గోమటం, సుహాస్, బ్రహ్మాజీ ప్రథమార్ధంలో నవ్వులు పండించారు. ద్వితీయార్ధంలో వెన్నెల కిషోర్ సందడి చేశారు. పీసీ శ్రీరామ్ కెమెరా మాయాజాలం పాటల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరో ఆకర్షణ. సున్నితమైన భావోద్వేగాలతో కథను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. సితార నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు
బలహీనతలు
+ నితిన్ - కీర్తి జోడీ
- తెలిసిన కథ
+వినోదం
+పాటలు.. ఛాయాగ్రహణం
చివరిగా: 'రంగ్ దే' ఇది ప్రేమ వర్ణం!
గమనిక:ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!