'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో కొత్త ఏడాదిలో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది నటి రష్మిక. ప్రస్తుతం ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'భీష్మ'. నితిన్ హీరో. వెంకీ కుడుముల దర్శకత్వం వహించాడు. నాగ వంశీ నిర్మాత. ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన రష్మిక పలు విషయాలను పంచుకుంది.
నితిన్ సీక్రెట్ కనిపెడతా
దేనినైనా సరే తెలుసుకోవాలనే ఉత్సాహం నాలో చాలా ఎక్కువ. అలా ఒకరోజు కుక్క బిస్కెట్స్ ఎలా ఉంటాయో తెలుసుకోవాలనిపించింది. అందుకే ఒక చిన్న ముక్క టేస్ట్ చేశా అంతే. అది నా సీక్రెట్. దానిని మొన్న నితిన్ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. నా సీక్రెట్ బయటపెట్టాడు కాబట్టి నేను కూడా తనకు సంబంధించిన ఏదో ఒక సీక్రెట్ కనిపెట్టి బయటపెడతా. (నవ్వులు)
నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు
నేను కాలేజ్‌లో ఉన్నప్పుడు 'అఆ' మూవీ చూశా. ఆ సినిమా బాగా నచ్చేసింది. ఒకవేళ సినీరంగంలోకి వెళ్తే తప్పకుండా ఇలాంటి మంచి సినిమా చేయాలనుకున్నా. 'భీష్మ' సినిమా షూటింగ్ మొదటిరోజు నితిన్‌ను చూసి ఎలా ఉంటారో? కలుస్తారో లేదో అని భయపడ్డా. కానీ ఆరోజు నితిన్, వెంకీ సరదాగా మాట్లాడుకోవడం చూసి.. ఓకే.. నేను కూడా సరదాగా ఉండొచ్చు అని ఫిక్స్ అయ్యా. నితిన్ చాలా సరదాగా ఉంటారు. నిశ్చితార్థానికి రెండు రోజుల ముందు నితిన్ తన లవ్ స్టోరీ గురించి చెప్పాడు.
వాలెంటైన్స్ డే.. చాలా బోర్
ఈ ఏడాది నా వాలెంటైన్స్‌డే చాలా బోర్‌గా గడిచింది. ఎందుకంటే ఆరోజు ఉదయాన్నే జిమ్‌కు వెళ్లి బాగా వర్కౌట్లు చేశా. ఆరోజు నా షూటింగ్స్ అన్ని క్యాన్సిల్ అయ్యాయి. దాంతో ఇంటికి వెళ్లి ఒక ఇంగ్లీష్ రొమాంటిక్ సినిమా పెట్టుకొని చూశా. ఆ సినిమా 20 నిమిషాలు చూసేసరికి బాగా బోర్ కొట్టింది. అదే సమయంలో నాకు కథ చెప్పడానికి ఒక వ్యక్తి వస్తే ఆయన చెప్పిన కథ విన్నా. అలా ఆరోజు అంతా బోర్‌గా గడిచింది. ఇలాంటి బోరింగ్ వాలెంటైన్స్ డే ఎవరికీ ఉండి ఉండదు. ఆరోజు నైట్ డిన్నర్‌కి వెళ్లా.
ఆ సాంగ్ ఎంజాయ్ చేశా..
'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో నేను చేసిన హీ ఇజ్ సో క్యూట్.. హీ ఇజ్ సో స్వీట్ పాటలోని స్టెప్పులను చాలా మంది టిక్‌టాక్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ పాటను నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశా. ఇప్పుడు 'భీష్మ' సినిమాలో డ్యాన్స్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను.