అనుష్క, మాధవన్, అంజలి కీలక పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'నిశ్శబ్దం'. హేమంత్ మధుకర్ దర్శకుడు. వేసవిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం థియేటర్లు తెరిచే పరిస్థితి లేకపోవడం వల్ల అమెజాన్ ప్రైమ్ వేదికగా అక్టోబరు 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమంత్ మధుకర్ ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'ప్రేక్షకులకు 'నిశ్శబ్దం'గానే మంచి థ్రిల్ ఇస్తుంది' - నిశ్శబ్దం సినిమా వార్తలు
స్టార్ హీరోయిన్ అనుష్క విభిన్న పాత్రలో నటించిన చిత్రం 'నిశ్శబ్దం'. అక్టోబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకుడు హేమంత్ మధుకర్ ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
అనుష్క చెప్పడం వల్లే 'నిశ్శబ్దం' చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు హేమంత్. మొదట బాలీవుడ్లో చేద్దామని భావించినప్పటికీ రచయిత కోనా వెంకట్ సహకారంతో నాలుగు భాషల్లో తెరకెక్కించినట్లు వెల్లడించారు. 'పుష్పకవిమానం' చిత్ర స్ఫూర్తిగా 'నిశ్శబ్దం' చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా మలిచినట్లు పేర్కొన్నారు హేమంత్.
లాక్డౌన్ కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడంపై సంతృప్తిగా ఉన్నారా? అని అడగ్గా.. "సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనే ఉద్దేశంతోనే తీశాం. కానీ, ప్రస్తుత పరిస్థితులను చూస్తే ఇప్పట్లో అది కుదిరేలా లేదు. ఒకవేళ థియేటర్లు తెరిచినా జనం వస్తారో లేదో తెలియదు. నేను సినిమా తీసిందే ప్రేక్షకుల కోసం. ఓటీటీలో కూడా ప్రజాదరణ ఎక్కువగా ఉంది. కాబట్టి, ఆ ప్లాట్ఫామ్లోనే విడుదల చేస్తున్నాం" అని పేర్కొన్నారు. ఓటీటీలో విడుదలవడం 'నిశ్శబ్దం' నిర్మాతలకు అన్నిరకాలుగా కలిసొస్తుందని తెలిపారు.