తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టాలీవుడ్​ను పలకరించనున్న కొత్త అందాలు ఇవే! - టాలీవుడ్​ కొత్త హీరోయిన్స్​

New Tollywood heroines 2022: కొత్తదనానికి.. కొత్త అందాలకు ఎర్ర తివాచీ పరిచి స్వాగతం పలకడంలో ముందుంటుంది తెలుగు చిత్రసీమ. అందుకే ఏటా పదుల సంఖ్యలో కొత్త వారు అదృష్టం పరీక్షించుకుంటుంటారు. మరి ఈ ఏడాది తెలుగు తెరకు పరిచయం కానున్న కొత్త భామలు ఎవరో చూసేద్దాం...

New Tollywood heroines 2022
కొత్త హీరోయిన్స్​ 2022

By

Published : Jan 10, 2022, 6:58 AM IST

Updated : Jan 10, 2022, 9:53 AM IST

New Tollywood heroines 2022: కొత్త సినీ క్యాలెండర్‌ తెరచుకుందంటే చాలు.. అగ్ర తారల సందడి ఎలా ఉండనుంది? స్టార్‌ నాయికల జోరు ఎలా సాగనుంది? యువ హీరోల వేగం ఎలా ఉంటుంది? అంటూ ఆరాలు మొదలైపోతాయి. ఇక కొత్త అందాలు తెరపై వచ్చి వాలనున్నాయని తెలిస్తే చాలు.. సినీప్రియుల దృష్టంతా ఆవైపే వెళ్లిపోతుంది. కొత్త ఏడాదిలో మురిపించే ఆ తారలెవరు? వారి సినిమాల విశేషాలేమిటీ? అంటూ ఆరాలు తీస్తుంటారు. 2022లో తెలుగు తెరపై కాలుమోపుతున్న కొత్త అందాల జాబితా పెద్దగానే ఉంది. ఇప్పటికే చిత్రీకరణలు పూర్తి చేసి వినోదాలు పంచడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు.. ప్రస్తుతం చిత్రీకరణల్లో బిజీగా ఉన్న వాళ్లు చాలా మందే ఉన్నారు. మరి ఈ ఏడాదిలో తెలుగు తెరపై సందడి చేయనున్న ఆ కొత్త తారకలు ఎవరో తెలుసుకుందాం..

అందం.. అభినయాలతో ఇటు తమిళం అటు మలయాళంలో స్టార్‌ నాయికగా మెరుపులు మెరిపిస్తోంది నజ్రియా ఫహాద్‌. ఇప్పుడీ అమ్మడు తొలిసారి తెలుగు తెరపై సందడి చేయనుంది. ప్రస్తుతం నాని కథానాయకుడిగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో 'అంటే సుందరానికి' చిత్రం రూపొందుతోంది. ఇందులో నాని సరసన నాయికగా ఆడిపాడుతోంది నజ్రియా. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ సినిమా.. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

నజ్రియా ఫహాద్‌

తెలుగు మినహా మిగిలిన దక్షిణాది భాషల్లో స్టార్‌ నాయికగా సత్తా చాటుతోన్న మరో మలయాళీ అందం సంయుక్తా మేనన్‌. ఇప్పుడీ సొగసరి 'భీమ్లానాయక్‌'తో తొలిసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. సాగర్‌ కె.చంద్ర తెరకెక్కిస్తున్నారు. త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే రాస్తున్నారు. ఇందులో రానాకు జోడీగానే సందడి చేస్తోంది సంయుక్తా. ఫిబ్రవరి 25న విడుదల కానుంది. సంయుక్త ప్రస్తుతం ధనుష్‌కు జోడీగా 'సార్‌' అనే ద్విభాషా సినిమాలో నటిస్తోంది. వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది.

సంయుక్తా మేనన్​

మోడల్‌గా పలు వాణిజ్య ప్రకటనల్లో నటించి.. అందరి దృష్టినీ ఆకర్షించిన భామ సాక్షి వైద్య. యువతలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ అమ్మడు.. 'ఏజెంట్‌'తో నాయికగా వెండితెరకు పరిచయమవుతోంది. అఖిల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోంది. ఈ సినిమా కోసమే తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నారు అఖిల్‌. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకున్న ఈ చిత్రం.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాక్షి వైద్య

నటనా ప్రాధాన్యమున్న పాత్రలకు చిరునామాగా నిలుస్తూ.. మలయాళంలో స్టార్‌ నాయికగా జోరు చూపిస్తోంది నటి రాజీషా విజయన్‌. సూర్య నటించిన 'జైభీమ్‌'లో మిత్రగా కీలక పాత్ర పోషించి అందరినీ మెప్పించింది. ఇప్పుడు రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని నేరుగా పలకరించనుంది. శరత్‌ మండవా తెరకెక్కిస్తున్నారు. దివ్యాంశ కౌశిక్‌ కథానాయిక. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా.. మార్చి 25న విడుదల కానుంది.

రాజీషా విజయన్​

మురిపించడమే తరువాయి...

తెలుగులో ఇప్పటికే తొలి సినిమా పూర్తి చేసి.. ప్రేక్షకుల్ని పలకరించేందుకు ఎదురు చూస్తున్న భామలు చాలా మందే ఉన్నారు. ఈపాటికే వెండితెరపై సందడి చేయాల్సిన వారి చిత్రాలు కరోనా పరిస్థితుల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి. బాలీవుడ్‌ నాయిక అలియా భట్‌, విదేశీ అందం ఒలీవియా మోరిస్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. జనవరి 7నే విడుదల కావాల్సిన ఈ సినిమా... కరోనా పరిస్థితుల వల్ల మరోసారి వాయిదా పడింది. 'దబాంగ్‌ 3'తో ఉత్తరాది ప్రేక్షకుల్ని అలరించిన కొత్త సొగసరి సయీ మంజ్రేకర్‌. ప్రస్తుతం తెలుగులో 'గని', 'మేజర్‌' చిత్రాల్లో సందడి చేస్తోంది. ఈ రెండూ ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్నాయి. మరి వీటిలో మొదటగా ఏ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరిస్తుందో తెలియాల్సి ఉంది.


ఇదీ చూడండి: తమిళ సినిమాల్లో ఇరగ్గొట్టేస్తున్న తెలుగు బ్యూటీ

Last Updated : Jan 10, 2022, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details