తెలంగాణ

telangana

ETV Bharat / sitara

2021 రౌండప్​: టాలీవుడ్​లో కొత్త భామలు.. తెగ మురిపించేశారు!

ప్రతిసారిలా 2021లో చాలామంది కొత్త భామలు తెలుగు సినిమాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో చాలామంది ఇప్పటికే బిజీ కూడా అయిపోయారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మలెవరు? వారి సంగతేంటి? చూసేద్దామా..

kethika sharma krithi shetty faria bdullah
కేతిక శర్మ కృతిశెట్టి ఫరియా అబ్దుల్లా

By

Published : Dec 11, 2021, 3:42 PM IST

ఏటా వెండితెరకు కొత్త నటులు పరిచయమవుతూనే ఉంటారు. వారిలో కొందరు వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తుంటారు. మరికొందరు ఆచితూచి అడుగేస్తుంటారు. అలా ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల భామలపై ఓ లుక్కేద్దాం.. ఎవరెవరు ఏ అవకాశాలు అందుకున్నారో చూద్దాం.

ముగ్గురూ ముగ్గురే..!

నటించిన తొలి చిత్రం విడుదలకాక ముందే హాట్‌ టాపిక్‌గా మారారు ముగ్గురు ముద్దుగుమ్మలు. వరుస అవకాశాలు అందుకుంటూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 2021లో ఎక్కువమందిని ఆకర్షించిన కథానాయికల జాబితాలో నిలిచారు. వారే కృతిశెట్టి, కేతిక శర్మ, మీనాక్షి చౌదరి.

ఉప్పెనలా అవకాశాలు

వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కించిన ‘ఉప్పెన’తో తెరంగేట్రం చేసింది కృతి శెట్టి. ఈ సినిమా గతేడాదే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ ఈ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకొచ్చింది. లాక్‌డౌన్‌ సమయంలో విడుదలైన ఇందులోని పాటలు సినీ అభిమానులపై మంచి ప్రభావం చూపాయి. కృతిశెట్టి హావభావాలకు అంతా ఫిదా అయిపోయారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అనేంతగా కృతిశెట్టి మాయ చేసింది. ప్రేక్షకులనే కాదు పరిశ్రమ వారినీ తన అభినయంతో ఆకర్షించింది. అందుకే ఈ చిత్రం విడుదలకు ముందే నాని హీరోగా రూపొందుతోన్న ‘శ్యామ్‌ సింగరాయ్‌’కి సంతకం చేసింది. ఈ సినిమా డిసెంబరు 24న విడుదలకానుంది. దీంతో పాటు సుధీర్‌ బాబు సరసన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌- లింగుస్వామి కాంబినేషన్‌లో రూపొందుతోన్న క్రేజీ ప్రాజెక్టు, నాగచైతన్య సరసన ‘బంగార్రాజు’లో నటిస్తోంది.

కృతిశెట్టి

రొమాంటిక్‌గా కనిపించి..

ఆకాశ్‌ పూరీతో ‘రొమాంటిక్‌’ సన్నివేశంలో కనిపించి కుర్రకారుని హీటెక్కిచింది కేతిక శర్మ. ఒకే ఒక్క వీడియోతో అందరినీ తనవైపు తిప్పుకుంది. ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే మరో చిత్రాన్నీ పట్టాలెక్కించింది. అదే నాగశౌర్య హీరోగా తెరకెక్కిన ‘లక్ష్య’. ఒకే ఏడాది రెండు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతానికి.. వైష్ణవ్‌తేజ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తున్నట్టు చిత్ర వర్గాల్లో వినిపిస్తోంది.

కేతిక శర్మ

మరో హిట్‌ అందుకుంది

సుశాంత్‌ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో నటిగా మారింది మీనాక్షి చౌదరి. తొలి పరిచయంలోనే విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ సరసన ‘ఖిలాడి’లో ఆడిపాడే అవకాశం దక్కించుకుంది. దీంతోపాటు ‘హిట్‌ 2’ని ఖరారు చేసింది. ఈ సినిమా అడివి శేష్‌ కథానాయకుడిగా రూపొందనుంది.

మీనాక్షి చౌదరి

చిట్టి.. ది సెన్సేషన్‌

తొలి పరిచయంలోనే ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికల జాబితాలో నిలిచింది ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు’తో వెండితెరకు పరిచయమైన ఈ భామ ఓ సెన్సేషన్‌ అయింది. హీరో నవీన్‌ పొలిశెట్టి పక్కన ‘చిట్టి’గా మెరిసి.. ప్రేక్షకుల్ని మురిపించింది. అందరితోనూ ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే’ అనిపించుకుంది. అఖిల్‌ హీరోగా ఇదే ఏడాది వచ్చిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’లో అతిథిగా మెరిసింది. నాగార్జున సరసన ‘బంగార్రాజు’లో ఓ ప్రత్యేక గీతంతో, విష్ణు హీరోగా తెరకెక్కనున్న ‘డి అండ్‌ డి’లో సందడి చేయనుందని సమాచారం.

ఫరియా అబ్దుల్లా

విజిల్‌తో పరోక్షంగా..

విజయ్‌ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘బిగిల్‌’. ‘విజిల్‌’ పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ డబ్బింగ్‌ సినిమాతో ఇక్కడి వారికి 2019లో పరోక్షంగా పరిచయమైన అమృత ఈ ఏడాది ‘రెడ్‌’తో నేరుగా పలకరించింది. రామ్‌ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో అమృత ముగ్గురు నాయికల్లో ఒకరిగా కనిపించింది. గాయత్రి అనే పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ఈ సినిమాలో తాను పోషించిన ‘అమ్మాయిగారు’ పాత్రే ఆమె ముద్దుపేరుగా మారిపోయింది. అంతగా తన అందం, అభినయంతో మెప్పిచింది. బుల్లితెర వ్యాఖ్యాత ప్రదీప్‌ కథానాయకుడిగా పరిచయమైన చిత్రమిది.

అమృత అయ్యర్

చెక్‌ పెట్టింది..

కన్నుగీటుతో ఎన్నో కుర్ర హృదయాల్ని కొల్లగొట్టిన భామ ప్రియాప్రకాశ్‌ వారియర్‌. నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘చెక్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. యాత్ర అనే పాత్రలో కనిపించి సందడి చేసింది. ‘ఇష్క్‌’తో మరోసారి ఆకట్టుకుంది. తేజ సజ్జా హీరోగా రూపొందించిన చిత్రమిది.

ప్రియా ప్రకాశ్ వారియర్

గాలిసంపత్‌ లవ్‌..

శ్రీ విష్ణు కథానాయకుడిగా రూపొందిన ‘గాలి సంపత్‌’ చిత్రంతో తెలుగువారికి పరిచయమైంది లవ్లీసింగ్‌. ఈ సినిమాలో విష్ణు ప్రియురాలిగా ఆకట్టుకుంది.

లవ్లీ సింగ్

హైదరాబాదీనే అయినా..!

హైదరాబాద్‌లో పుట్టి ముంబయిలో స్థిరపడిన నటి దియా మీర్జా. 2001లో ‘రెహ్నా హై తేరే దిల్‌ మే’ అనే బాలీవుడ్‌ చిత్రంతో కథానాయికగా మారిన ఆమె ఇన్నేళ్లకు తెలుగు సినిమాలో నటించింది. నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘వైల్డ్‌డాగ్‌’తో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైంది.

దియా మీర్జా

రాజావిక్రమార్కుడితో కలిసి..

కార్తికేయ గుమ్మకొండ హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’తో తెలుగువారి దృష్టిని ఆకర్షించింది తమిళ నటి తాన్యా రవిచంద్రన్‌. కాంతి అనే పాత్రలో ఒదిగిపోయి, ప్రేక్షకుల్ని మెప్పిచింది.

తాన్యా రవిచంద్రన్

సుందర్‌ భార్యగా..

గీత్‌ సైని.. ఆనంద్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ‘పుష్పక విమానం’తో కథానాయికగా మారింది. సుందర్‌ (కథానాయకుడి పాత్ర) భార్య మీనాక్షిగా గీత్‌ విశేషంగా ఆకట్టుకుంది.

గీత్ సైనీ

శ్రీలీల సందడి

సుమారు పాతికేళ్ల క్రితం శ్రీకాంత్‌ కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘పెళ్లిసందడి’. ఇదే టైటిల్‌తో ఆయన తనయుడు రోషన్‌ ఈ సంవత్సరం సందడి చేశారు. ఈ సినిమాతోనే శ్రీలీల తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది. రవితేజ సరసన ఓ చిత్రంలో అవకాశం దక్కించుకుంది.

శ్రీలీల

అనుభవించు రాజా అంటూ..

రాజ్‌తరుణ్‌ హీరోగా నటించిన ఎంటర్‌టైనర్‌ ‘అనుభవించు రాజా’. నటి కశిష్‌ ఖాన్‌ ఈ సినిమాతో టాలీవుడ్‌ నాయికల జాబితాలో చేరింది. ఐటీ ఉద్యోగి శ్రుతిగా అలరించింది.

కశిష్ ఖాన్

వైశాలిలో మంచి నటి కనిపించింది..

‘కనబడుట లేదు’ అనే చిత్రంతో తనలోని నటిని పరిచయం చేసింది వైశాలిరాజ్‌. సునీల్‌, సుక్రాంత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రమిది.

వైశాలీ రాజ్

తెల్లవారితే.. మధు

శ్రీ సింహా కథానాయకుడిగా తెరకెక్కిన ‘తెల్లవారితే గురువారం’తో నటిగా మారింది మిశా నారంగ్‌. ఈ చిత్రంలో మధు అనే పాత్రలో కనిపించింది.

మిశా నారంగ్

శశి చెలి..

‘శశి’ సినిమాతో తొలి పరిచయంలోనే ఆకట్టుకుంది రాశీసింగ్‌. ఆది హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో సునీతగా మెప్పించింది. ఆది స్నేహితురాలి పాత్రకి వన్నె తీసుకొచ్చింది.

రాశీ సింగ్

షాదీ దృశ్యం

‘మొగలిరేకులు’ సీరియల్‌ ఫేం సాగర్‌ (ఆర్కే నాయుడు) హీరోగా నటించిన చిత్రం ‘షాదీ ముబారక్‌’. ఈ చిత్రంతో దృశ్య రఘునాథ్‌ తెలుగు ప్రేక్షకుల్ని ఆకర్షించింది.

దృశ్య మేఘనాథ్

నవమి.. నాంది

అల్లరి నరేశ్‌ చేసిన వినూత్న ప్రయోగ చిత్రం ‘నాంది’. ఈ సినిమాతో నవమి నాయికగా పరిచయమైంది. మీనాక్షి అనే పాత్రలో చక్కగా ఒదిగిపోయింది.

హీరోయిన్ నవమి

ఓటీటీ వేదికగా...

అద్భుతమైన చిత్రంతో..

ప్రముఖ నటుడు రాజశేఖర్‌ తనయ శివానీ తెరంగ్రేటం ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ ఏడాది ‘అద్భుతం’ అనే సినిమాతో ప్రేక్షకులకి పరిచయమైంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో విడుదలకాలేదు. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ వేదికగా అలరిస్తోంది. వెన్నెల అనే పాత్ర పోషించి, మంచి మార్కులే కొట్టేసింది.

శివానీ

వివాహ భోజనం వడ్డించి..

హాస్య నటుడు సత్య ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’. ఈ సినిమాలో నాయికగా అవకాశం దక్కించుకుని తన నటనతో మెప్పించింది ఆర్జవీ రాజ్‌. గృహిణి అనిత పాత్రలో ఒదిగిపోయింది. ఈ చిత్రం ఓటీటీ ‘సోనీలివ్‌’లో విడుదలైంది.

ఆర్జవీ రాజ్

వీరు ఇలా..

కార్తిక్‌ రత్నం, నవీన్‌ చంద్ర, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. ఈ సినిమాతోనే కృష్ణ ప్రియ తెరంగ్రేటం చేసింది. ఈ సినిమా ఓటీటీ ‘ఆహా’లో విడుదలైంది. ‘జీ 5’లో విడుదలైన ‘బట్టల రామస్వామి బయోపిక్కు’లో శాంతిరావు, లావణ్య రెడ్డి అలరించారు.

కృష్ణప్రియ

ABOUT THE AUTHOR

...view details