2017లో 'బాహుబలి: ద కంక్లూజన్', 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాల తర్వాత పూర్తిస్థాయి హీరోగా కనిపించలేదు నటుడు రానా. త్వరలో 'అరణ్య' అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను పంచుకున్నాడు. తొందర తొందరగా సినిమాలు చేయాలనే ఆలోచన తనకు అసలు లేదని అన్నాడు.
"వెంట వెంటనే సినిమాలు విడుదల చేయడానికి నేనేం ప్రముఖ నటుడ్ని కాదు. విభిన్న కథలను ఎంచుకొని ప్రేక్షకులను అలరించాలనేదే నా ఆలోచన. 'బాహుబలి' మూడేళ్లలో పూర్తవుతుందనుకున్నా. కానీ ఐదేళ్లు పట్టింది. ఆ అనుభవం చాలా నేర్పింది. 'అరణ్య' అలాంటిదే. నేను ఓ చిత్రంలో నటించేందుకు కొంత ఎక్కువ సమయాన్ని తీసుకున్నానంటే ప్రేక్షకులను మెప్పించడానికే చూస్తా. అలాంటి వాటిని వారు అంగీకరించకపోతే మళ్లీ 'ఘాజీ' లాంటి చిన్న బడ్జెట్ చిత్రాల్లో నటిస్తా. 'అరణ్య' షూటింగ్ మూడు భాషల్లో ఒకేసారి జరిగింది. అందువల్లే నా పాత్రలో మరింత వైవిధ్యం చూపించగలిగాను"
- రానా దగ్గుబాటి, నటుడు