తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసి.. నెట్​ఫ్లిక్స్ వైస్​ప్రెసిడెంట్​గా..! - netflix monika shegil

బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలో వచ్చే కార్యక్రమాలు కళ్లింతలు చేసుకుని చూసిన అమ్మాయి.. ఆ తెరపైనే అద్భుతాలు చేయాలని కలలుకంది. బుల్లితెరపై చూసిన కథలనే అందరికీ ఆసక్తిగా చెప్పేది. అంతేనా... ఎన్నో సాహసాలు చేసి డాక్యుమెంటరీలు తీసింది. అంతటితో ఆగిపోలేదు. నవతరం ప్రేక్షకుల నాడిని పసిగట్టింది. నెట్‌ఫ్లిక్స్‌ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌గా మోనికా షెర్గిల్‌ అద్భుతాలు చేస్తోంది. ఫోర్బ్స్‌ పత్రిక ప్రశంసలందుకుంది.

netflix india wise president monika shergil journey
నెట్​ఫ్లిక్స్ ఇండియా వైస్​ప్రెసిడెంట్ మోనికా షెర్గిల్

By

Published : Jun 12, 2020, 1:28 PM IST

మోనిక తన స్నేహితురాళ్లకు కథలు చెప్పేది. అవి సామాన్యంగా ఉండటం ఆమెకు నచ్చేది కాదు. బోలెడు మలుపులుండాలి. గగుర్పొడిచే క్లైమాక్స్‌ ఉండాలి. ఇదిగో ఆ అలవాటే ఆమెను... వినోద రంగంవైపు ఆకర్షించింది. మీరట్‌కు చెందిన మోనిక దిల్లీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేసిన తరువాత జర్నలిజం కోర్సు పూర్తి చేసింది. గ్రీన్‌ ఆస్కార్‌ అవార్డు గెల్చుకున్న ‘లివింగ్‌ ఆన్‌ ద ఎడ్జ్‌’ కార్యక్రమానికి రిపోర్టర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది.

భారత్‌లో పర్యావరణానికి హాని కలిగిస్తున్న అంశాలను చాటి చెప్పేలా ఈ టీవీ సిరీస్‌ను మలిచింది. 1990లోనే డాక్యుమెంటరీలు, ట్రావెల్‌ స్టోరీలు, పర్యావరణ పరిరక్షణ విశిష్టతను చాటిచెప్పేలా రూపొందించిన వీడియో సిరీస్‌లు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అక్రమ మైనింగ్‌, అడవుల నరికివేత వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను తన డాక్యుమెంటరీల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. సోనీ, జీ నెట్‌వర్క్‌ వంటి సంస్థలకు ప్రోగ్రామింగ్‌ విభాగంలో పని చేసింది. సత్యమేవ జయతే టీవీషోకు ప్రోగ్రామింగ్‌, స్ట్రాటజీ విభాగాల్లో సేవలందించింది.

డిజిటల్‌ మార్పు పసిగట్టి...

వినోద రంగంలో వస్తున్న మార్పులను ముందుగానే ఊహించింది మోనిక. ఈ క్రమంలో వయాకామ్‌18 అనే అంకుర సంస్థని స్థాపించింది. ప్రారంభించిన రెండేళ్లకే వయాకామ్‌ సంస్థ.. భారత్‌లో ఓటీటీ (ఓవర్‌ ద టాప్‌) విభాగంలో రెండో స్థానానికి చేరుకుంది. కొన్ని నెలల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా ఆహ్వానాన్ని అందుకుంది. ఆ సంస్థలో సిరీస్‌, ఇంటర్నేషనల్‌ ఒరిజినల్స్‌ విభాగాలకు అధిపతిగా బాధ్యతలు స్వీకరించి అనతి కాలంలోనే ఉపాధ్యక్ష్యురాలిగా ఎదిగింది.

మార్పుతో గుర్తింపు....

ప్రేక్షకుల ఆసక్తికి తగ్గట్లుగా యాప్‌, వెబ్‌సిరీస్‌లలో మార్పులు చేయించింది మోనిక. లాక్‌డౌన్‌ కారణంగా సినిమా థియేటర్లు మూసివేయడం ఓటీటీ ప్లాట్‌ఫాంలకు కలసి వచ్చింది. డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. సినిమాల స్థానంలోకి వెబ్‌సిరీస్‌లు వచ్చాయి. ఈ మార్పులన్నీ పసిగట్టి అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించింది.. సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో పాటు స్టాండప్‌ కామెడీషోలు, పిల్లలకు కార్టూన్‌ సిరీస్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫలితంగా వీక్షకుల సంఖ్య పెరిగింది.

ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాం, వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌లలో నెట్‌ఫ్లిక్స్‌ ముందు వరుసలో ఉండటానికి ఆమె కృషి, కార్యదక్షతే కారణం. ఎంచుకున్న రంగంలో రాణించాలంటే ఈతరం యువతులకు మీరిచ్చే సూచనలేంటి అని మోనికను అడిగితే... ‘ఒడుదొడుకులు ఎదురుకాకుండా ఎవరూ విజయతీరాలకు చేరుకోలేరు. సక్సెస్‌ గ్రాఫ్‌ ఎన్నటికీ ఒక సరళరేఖలా ఉండదు. అందుకే ఓటముల గురించి ఆలోచించకుండా అనుకున్నది చేయాలి’ అని సూచిస్తోందామె.

ABOUT THE AUTHOR

...view details