కరోనా దెబ్బకు థియేటర్‌లు మూతపడ్డాయి. ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియదు. వచ్చే నెల్లో తెరిచే అవకాశం ఉన్నా... ప్రేక్షకులు వస్తారన్న నమ్మకం చాలామంది నిర్మాతల్లో కనపడటం లేదు. అందుకే కొందరు ఓటీటీల బాట పట్టారు. ఈ వేదికలు చిన్న తారల నుంచి అగ్ర తారలు నటించిన చిత్రాల వరకూ విడుదల చేసేస్తున్నాయి. ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియో ఒకేసారి ఏడు చిత్రాలను ప్రకటించింది. డిస్నీ హాట్‌స్టార్ ఇదేబాటలో నడుస్తున్నట్లు తెలిపింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ భారీ ప్రకటన చేసింది. తమ ఓటీటీ నుంచి 17 ఒరిజినల్స్ రానున్నాయంటూ చెప్పుకొచ్చింది.
- నెట్‌ఫ్లిక్స్ తాజా జాబితాలో ఆరు కొత్త చిత్రాలు వచ్చి చేరాయి. నిత్యం గొడవలు పడుతూ ఉండే ఓ నలుగురి వ్యక్తుల కథగా తెరకెక్కిన చిత్రం 'లూడో'. ఇందులో అభిషేక్‌బచ్చన్, రాజ్‌కుమార్ రావ్, ఆదిత్యరాయ్ కపూర్, ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సంజయ్ దత్- అభిషేక్ బచ్చన్ - సంజయ్‌దత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ 'టోర్బాజ్'. ఆప్ఘనిస్తాన్‌లోని బాల ఆత్మహుతి దళం నేపథ్యంలో సాగుతుంది.
- రాధికా ఆప్టే, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'రాత్ అఖేలే హై'.
- స్వేచ్ఛగా జీవితం గడపాలనుకునే ఇద్దరి అక్కాచెల్లెళ్ల కథ 'డోలీ కిట్టీ ఔర్ ఓ ఛమక్ సితారే'. ఇందులో భూమి పెడ్నేకర్, కొంకణా సేన్ శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.
- యామీ గౌతమ్, విక్రాంత్ మాసే నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'గిన్నీ వెడ్స్ సన్నీ'. యానిమేటెడ్ రొమాంటిక్ చిత్రం 'బోంబే రోజ్'.
తారలు నటించిన వెబ్ సిరీస్‌లు
సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌ల్లోనూ తారలు సందడి చేస్తున్నారు. ఓ ఐదు కొత్త వెబ్‌సిరీస్‌లు త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నాయి. టబు, ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ 'ఎ సూటబుల్ బాయ్'. దీంతో పాటు వస్తున్న మరో అడల్ట్ రొమాన్స్ కథ 'మిస్‌మ్యాచ్డ్'. పూజాభట్ ప్రధాన పాత్రలో నటించిన 'బోంబే బేగమ్స్'తో పాటు కథానాయిక స్వరభాస్కర్ నటించిన 'భాగ్ బినీ భాగ్' సిరీస్‌లూ ఈ జాబితాలో ఉన్నాయి. 'మసాబా మసాబా' అనే మరో వెబ్‌సిరీస్‌నూ నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
- నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన జాబితాలో మరో ఆరు చిత్రాలూ ఉన్నాయి. వీటిలో 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్', 'త్రిభంగ: తేదీ మేదీ క్రేజీ', 'ఖాలీ ఖుహి', 'సీరియస్ మెన్' చిత్రాలపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
- యుద్ధ విమానం నడిపినభారతీయ తొలి మహిళా పైలెట్ గుంజన్ సక్సేనా కథతో వస్తున్న 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్'. జాన్వీకపూర్ ప్రధాన పాత్రలో నటించింది. ఇది ఆగస్టు 12న విడుదల కానుంది.
- కాజోల్ ప్రధాన పాత్రలో నటించిన 'త్రిభంగ: తేదీ మేదీ క్రేజీ'. కుటుంబ కథగా తెరకెక్కింది.
- పంజాబ్‌లోని ఓ కుగ్రామం నేపథ్యంగా పాగే హారర్ చిత్రం 'ఖాలీ ఖుహి', షబానా అజ్మీ, సత్యదీప్ మిశ్ర తదితరులు నటించారు.
- నవాజుద్దీన్ సిద్దిఖీ, నాజర్ తదితరులు నటించిన చిత్రం 'సీరియస్ మెన్'. మను జోసెఫ్ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది.
- పోలీస్ కథతో బాబీ డియోల్ నటించిన చిత్రం 'క్లాస్ ఆఫ్ 83'తో పాటు అనిల్ కపూర్, అనురాగ్ కశ్యప్ నటించిన డార్క్ కామెడీ 'ఏకే వర్సెస్ ఏకే' కూడా త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో రానున్నాయి.