తెలంగాణ

telangana

By

Published : Jun 28, 2021, 6:30 PM IST

ETV Bharat / sitara

టీవీలో హిట్.. సినిమాల్లో సూపర్​హిట్!

దక్షిణాది చిత్రసీమలో స్టార్​డమ్​ దక్కించుకున్న నటులెందరో ఉన్నారు. అయితే అందులో కొంతమందికి సినిమాల్లో నటించే అవకాశం అంత తేలిగ్గా దక్కలేదు. కెరీర్​ ఆరంభంలో ఎంతో కష్టపడి తొలుత బుల్లితెరమీద మెరసి ఆ తర్వాత వెండితెరపై కనువిందు చేసే ఛాన్స్​ను దక్కించుకున్నారు. అలా తమలోని ప్రతిభను కనబరిచి తామేంటో నిరూపించుకున్నారు. వీరందరు తమ కెరీర్‌ను మలుచుకున్న తీరు ఎందరో నటులకు స్ఫూర్తిదాయకం.

south Indian stars who began their career on TV
బుల్లితెర నుంచి వెండితెర

సినిమాల్లో స్టార్​హోదా అంటే అంత తేలికైన విషయం కాదు. అదృష్టం, ప్రతిభ, అవకాశాలు.. ఇలా అన్ని కలిసిరావాలి. వీటన్నిటికి తోడు చాలా కష్టపడాలి. దీనినే నమ్ముకుని బుల్లితెరపై సత్తాచాటి వెండితెర వైపు అడుగులువేశారు కొందరు నటీనటులు. తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి, భారీ అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. అభిమానులు తమ సినిమా కోసం ఎదురుచూసే స్థాయికి చేరుకున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న పలువురు దక్షిణాది నటుల గురించే దక్షిణాది నటులెవరో ఓ సారి చూద్దాం..

కొత్త నిర్వచనం​(Vijay Sehtupati)

తమిళ నటుడు విజయ్​సేతుపతి.. భారతచిత్రసీమలో ప్రస్తుతం ఈ పేరు తెలియనివారు ఉండరు. దక్షిణాదికి మరో సూపర్‌స్టార్‌ ఆయన! వైవిధ్య, విలక్షణ నటనతో అన్ని వర్గాల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. స్టార్‌ అంటే 'హీరో'గానే కనిపించాల్సిన అవసరం లేదంటూ తనదైన పాత్రలతో కొత్త నిర్వచనం ఇచ్చారు. హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. 2006లో సన్​టీవీలో ప్రసారమయ్యే 'పెన్'​ ధారావాహికతో ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చారు. ప్రస్తుతం పదికి పైగా చిత్రాలు చేస్తున్నారు. ఇందులో 'తుగ్లక్​ దర్బార్'​, 'లాబమ్​', 'కరోనా కుమార్'​, 'విడుథలయ్'​, 'అన్నాబెల్లె సుబ్రమనియమ్'​, 'ముంబైకర్'​, 'గాంధీ టాక్స్'​, 'ఇదమ్​ పొరుల్​ యెవల్'​ సహా పలు ప్రాజెక్టులు ఉన్నాయి. బాలీవుడ్​లోనూ కత్రినాకైఫ్​తో కలిసి ఓ సినిమా చేయనున్నారు.

ఇదీ చూడండి:జూ.ఆర్టిస్ట్​గా పనికిరావని విజయ్ సేతుపతిని తిట్టేవారు!

ఈటీవీ కన్నడలో అవకాశం(Kannadastar Yash)

'కేజీఎఫ్‌' హీరో యశ్‌.. 'రాకీ భాయ్‌'గా ప్రేక్షకుల మనసులో చెదిరిపోని ముద్రవేసుకున్నారు. చిన్నతనం నుంచీ హీరో అవ్వాలని కలలు కని ఇంట్లోంచి పారిపోయి మరీ తన కలను నిజం చేసుకున్నారు. సినీ నేపథ్యం లేకపోయినా స్టార్‌గా, పాన్‌ ఇండియా నటుడిగా ఎదిగారు. కెరీర్​ ఆరంభంలో చాలా కష్టపడ్డాక ఈటీవీ కన్నడలో ప్రసారమయ్యే 'నందగోకుల' సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత 'మలెబిల్లు ముక్తా', 'ప్రీతి ఇల్లదా మేలే' ధారావాహికల్లోనూ నటించారు. ఈ క్రమంలోనే తన ప్రతిభ, ఉన్న పరిచయాలా వల్లా సినిమాల్లో నటించే ఛాన్సు వచ్చింది. 'జంబడ హుడుగీ', 'మొగ్గిన మనసు' చిత్రాల్లో సహాయనటుడిగా చేశారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'కేజీఎఫ్'తో స్టార్ హోదా సంపాదించారు. త్వరలోనే 'కేజీఎఫ్​ 2'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి:జ్వాల కన్న జ్వాలాపుత్రుడు.. ఈ రాకీభాయ్!

లేడీ సూపర్​స్టార్​గా(Nayantara)

మూడుపదుల వయసులోనూ అందరూ మెచ్చిన తళుకు తార నయనతార. అందం, అభినయం కలయికతో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో చిత్రాలు చేస్తూ దక్షిణాదిన అత్యధిక పారితోషకం అందుకుంటున్న నటిగా లేడీ సూపర్​స్టార్​గా గుర్తింపు తెచ్చుకుంది. చీరకట్టులో సంప్రదాయంగా కనిపించి.. స్విమ్‌ సూట్‌లో అదరహో అనిపించుకోవడం ఆమెకే సాధ్యమైంది. లేడీ ఓరియెంటెడ్​ చిత్రాలకు కేరాఫ్​ అడ్రస్​ మారిన ఈమె.. 'చమయమ్​' టీవీ షోకు హోస్ట్​గా కెరీర్​ ప్రారంభించింది. 2003 మలయాళం సినిమా 'మానసినక్కారె'తో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. అనంతరం 'చంద్రముఖి', 'గజిని' సినిమాలు.. తెలుగు, తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించి ఈమెకు మంచిపేరు తెచ్చిపెట్టాయి. 'లక్ష్మీ' చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వెనుక తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రస్తుతం 'నేత్రికన్'​, 'అన్నాత్తె', 'కాత్తు వాకుల రెండు కాదల్'​ చిత్రాల్లో నటిస్తోంది.

ఇదీ చూడండి:ఆ మాట చెప్పే ఒకే ఒక్క హీరోయిన్ నయనతార!

రియాలిటీ షోతో(Sivakarthikeyan)​

కోలీవుడ్​లో అశేష అభిమానులను సొంతం చేసుకున్న హీరోల్లో శివకార్తికేయన్​ ఒకరు. తమిళ రియాలిటీ షోలో కంటెస్టెంట్​గా, స్టాండ్​అప్​ కమెడియన్​గా తన కెరీర్​ను మొదలుపెట్టి, ఆ తర్వాత యాంకర్​ అయ్యారు. మెల్లగా అవకాశాలు రావడం వల్ల సినిమాల్లో సహాయపాత్రలు చేస్తూ.. మాస్​ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'రెమో', 'శక్తి' వంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగువారికీ దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన 'డాక్టర్'​, 'డాన్​', 'అయలాన్'​, 'పూవెల్లమ్​ కెట్టుపార్'​ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

శివకార్తికేయన్​

గ్లామర్‌ పాత్రలకంటే గ్రామర్‌ పాత్రలకే(Saipallavi)

'భానుమతి ఒక్కటే పీస్‌' అంటూ సాయిపల్లవి ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పాలా! చూడగానే మన పక్కింటి అమ్మాయిలా, తనదైన అల్లరితో సందడి చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆకట్టుకునే అభినయంతో కుర్రకారుకు మనసులను దోచేసిన ఈ ముద్దుగుమ్మ.. 2015లో వచ్చిన మలయాళ చిత్రం 'ప్రేమమ్'తో అరంగేట్రం చేసింది. అందం కంటే తన ప్రతిభను నమ్ముకుని చిత్రసీమలో స్టార్​గా ఎదిగింది. అంతకముందే ఈమె ఉంగలిల్​ యార్​ అదుథా ప్రభుదేవా, ఈటీవీ 'ఢీ' రియాలిటీ డ్యాన్స్​షోలో కంటెస్టెంట్​గా మెరిసింది. టాలీవుడ్​లో 'ఫిధా'తో అడుగుపెట్టి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. అనంతరం పలు​ సినిమాల్లో నటిస్తూ తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకులను పలకరిస్తోంది. నటనతోనే కాకుండా డ్యాన్స్​తోనూ ఆకట్టుకుంటుందీ ఈ భామ. ఆమె పాటలు 'వచ్చిందే పిల్ల మెల్లగా వచ్చిందే..', 'రౌడీ బేబీ', 'సారంగదరియా' యూట్యూబ్​లో రికార్డు వ్యూస్ సాధిస్తూ అలరిస్తున్నాయి.

ఇదీ చూడండి:సాయిపల్లవికి ఇంట్లో నుంచే పోటీ మొదలైందా?

రొమాంటిక్​ హీరో(R.Madhavan)

అద్భుత పాత్రలు, లవ్​స్టోరీలతో మెప్పించి, ప్రేక్షకుల్ని అలరించిన రొమాంటిక్​ హీరో మాధవన్. దర్శకుడు, నిర్మాత, రచయిత, గాయకుడిగా ప్రేక్షకాదరణ పొందారు. అయితే ఈయన కెరీర్​ ప్రారంభంలో 'సీ హాక్స్'​, 'బనేగీ అప్ని బాత్'​, 'ఘర్​ జమయ్​' వంటి సీరియల్స్​లో నటించారు. ఇవి ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

90ల్లో వచ్చిన మణిరత్నం 'అలైపాయతే'(తెలుగులో 'సఖి') సినిమాతో మాధవన్​ చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కూడా తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో పేరు సంపాదించుకున్నారు. 1996లో 'ఇస్​రాత్​ కి సుభా నహిన్'​ సినిమాతో వెండితెర అరంగేట్రం చేసిన ఈయన.. ప్రస్తుతం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'​(దర్శకుడిగానూ), 'అమ్రికి పండిత్​' సినిమాల సహా '7th సెన్స్​', 'డికపుల్డ్​' వెబ్​సిరీస్​ల్లోనూ నటిస్తున్నారు.

ఇదీ చూడండి:Madhavan: కెరీర్​ ఆరంభంలోనే మూడు భాషల్లో నటన!

తేనేకళ్ల సుందరి(Hansika Motwani)

2003లో బాలనటిగా బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన హన్సిక.. 'దేశ ముదురు'తో 2007లో టాలీవుడ్‌లో కాలుమోపింది. తొలి సినిమాతోనే యువతను ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ.. ఎక్కువగా ప్రేమ కథల్లో నటిస్తూ యువకుల కలల రాణిగా మారింది. అయితే తన కెరీర్​ను 'షకలక బూమ్​ బూమ్'​ టీవీషోతో ప్రారంభించింది. 'దేశ్​ మై నికలా హోగా చంద్'​ ధారావాహికలోనూ నటించింది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ఇదీ చూడండి:హన్సిక.. నిన్ను ఏమని పొగడాలి ఇక


విలక్షణమైన నటనకు కేరాఫ్​ అడ్రస్​(Prakash Raj)

విలక్షణమైన నటనకు చిరునామా ప్రకాశ్​రాజ్‌. హీరోగా మెప్పించారు. విలన్​గా భయపెట్టారు. సహాయ నటుడిగా మురిపించారు. దూరదర్శన్‌ కన్నడ సీరియల్స్‌ ద్వారా తెరపై నటుడిగా ఆయన కెరీర్‌ ప్రారంభమైంది. 'బిసిలు కుదిరే', 'గుద్దాడ భూత' సీరియల్స్‌ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత అయన కన్నడ సినీరంగంలో కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు చేస్తూ ప్రాచుర్యంలోకి వచ్చారు. 'రామాచారి', 'రణధీర', 'నిషాకర్ష', 'లాకప్‌ డెత్‌' లాంటి చిత్రాల్లో ఆయన సపోర్టింగ్‌ రోల్స్‌ వేశారు. కన్నడ కథానాయకుడు విష్ణువర్ధన్‌ నటించిన 'హరికేయ కురి' చిత్రం ప్రకాష్‌ రాజ్‌ నట జీవితంలో టర్నింగ్‌ పాయింట్‌. ప్రస్తుతం దక్షిణాదితో పాటు హిందీలోనూ పలు చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ప్రకాశ్​రాజ్​

షారుక్​ఖాన్​, సుశాంత్​ సింగ్​, ఆమిర్​ఖాన్​, శరద్​ కేల్కర్​, ఇర్ఫాన్​ ఖాన్​, విద్యాబాలన్​, యమీగౌతమ్​, ఆయుష్మాన్​ ఖురానా ఇంకా పలు బాలీవుడ్​ నటులు కూడా తమ కెరీర్​ను బుల్లితెర నుంచే ప్రారంభించడం విశేషం.

ఇదీ చూడండి:వెండి తెరపై 'ప్రకాశ్ రాజ' సంకల్పం

ABOUT THE AUTHOR

...view details