Naveen Polishetty and Anushka Shetty Movie: ఒక్కసారి స్టార్ స్థాయికి చేరుకుంటే అందుకు తగ్గ కథలు, కాంబినేషన్లతోనే ప్రయాణం చేయాలనుకుంటారు కథానాయికలు. అందుకు విరుద్ధంగా ప్రయత్నిస్తే స్టార్‌డమ్ దెబ్బతింటుందన్న భయాలు వెంటాడేవి. ఈతరం నాయికలు అలాంటి భయాల్ని దూరం పెట్టేస్తున్నారు. కథ బాగుంటే చాలు.. అగ్ర, కుర్ర కథా నాయకులన్న లెక్కలకు పోకుండా రంగంలోకి దూకేస్తున్నారు.
'అరుంధతి', 'భాగమతి' వంటి విజయవంతమైన చిత్రాలతో నాయికా ప్రాధాన్య సినిమాలకు చిరునామాగా మారింది అనుష్క. 'నిశ్శబ్దం' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సీనియర్ భామ.. మళ్లీ కెరీర్‌ను పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆమె యు.వి. క్రియేషన్స్ బ్యానర్‌లో ఓ చిత్రం చేసేందుకు అంగీకారం తెలిపింది. పి.మహేష్‌బాబు దర్శకుడు. ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రం.. త్వరలో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించుకోనుంది. ఓ కొత్తతరం కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాలో.. యువ కథానాయకుడు నవీన్ పొలిశెట్టితో కలిసి సందడి చేయనుంది అనుష్క. ఈ ప్రత్యేకమైన కాంబినేషన్‌పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్ర హీరోలు మొదలు.. రవితేజ, ప్రభాస్ వంటి ఈతరం హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేసిన కథానాయిక నయనతార. ఇప్పుడామె చిరంజీవి - మోహన్‌రాజా కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'గాడ్‌ఫాదర్'లో నటిస్తోంది. ఇందులో ఆమె యువహీరో సత్యదేవ్‌తో కలిసి తెర పంచుకోనుంది. మలయాళంలో విజయవంతమైన 'లూసీఫర్'కు రీమేక్‌గా రూపొందుతోన్న చిత్రమిది. సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉంది.