అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం 'అల.. వైకుంఠపురములో'. ఈ సినిమాలో టాలీవుడ్ యువ హీరోలు నవదీప్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో సుశాంత్.. హీరోయిన్ పూజాహెగ్డేకు అన్నగా నటిస్తున్నాడని, నవదీప్ విలన్‌గా కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై సామాజిక మాధ్యమాల వేదికగా క్లారిటీ ఇచ్చాడు సుశాంత్.
"అల.. వైకుంఠపురములో నా పాత్ర గురించి వస్తున్నవన్నీ అవాస్తవాలు. నేను అల్లు అర్జున్‌కు కానీ, పూజాకికానీ సోదరుడిగా నటించట్లేదు. ఈ సినిమాలో నా పాత్ర వెనకున్న సస్పెన్స్ ఏంటో థియేటర్లోనే తెలుసుకోవాలి" -సుశాంత్, టాలీవుడ్ హీరో.
నవదీప్ విషయానికొస్తే ఆ మధ్య ఈ యువ హీరో సిక్స్‌ప్యాక్ లుక్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ అవతారం స్టైలిష్ స్టార్ సినిమా కోసమే అనుకున్నారు. కానీ, తాజాగా ఈ చిత్రం నుంచి బయటకొచ్చిన ‘సామజవరగమన’ పాట విజువల్స్‌ను ఓసారి జాగ్రత్తగా గమనిస్తే ఇప్పటి వరకు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలుస్తుంది. ఈ పాటలో ఓ సన్నివేశంలో అల్లు అర్జున్, రాహుల్ రామకృష్ణ, నవదీప్ ముగ్గురూ కలిసి చిరునవ్వులు చిందిస్తూ దర్శనమిచ్చారు.
మరి వీళ్లిద్దరి పాత్రలను ‘అల వైకుంఠపురములో’ త్రివిక్రమ్ ఎలా డిజైన్ చేశాడో తెలియాలంటే టీజర్ అయినా వచ్చే వరకు వేచి చూడక తప్పదు.
ఇదీ చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' నటి