ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన 'నాట్యం'(sandhya raju natyam movie) సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది(natyam movie release date). రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లకి మంచి స్పందన లభించింది. టాలీవుడ్ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకొంది. 'నాట్యం' విడుదల(natyam movie release date) సందర్భంగా హీరోయిన్ సంధ్యారాజు పంచుకున్న సినిమా కబుర్లు మీకోసం..
శ్వాస, ధ్యాస..నాట్యమే
చిన్నప్పటి నుంచి నాట్యం అంటే ప్రాణం. నా ఆలోచనలెప్పుడూ దాని చుట్టూనే తిరుగుతాయి. నాట్య ప్రదర్శనలు చేస్తే అభిరుచి ఉన్న కొద్దిమంది మాత్రమే చూస్తారు. సినిమా ద్వారా ఎక్కువమందికి చేరువుతుందనే ఈ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టాను. సినిమా ప్రపంచం పెద్దగా పరిచయం లేదు. నా ధ్యాస ఎప్పుడూ నాట్యం మీదే ఉండేది. నాట్యమే ప్రధానంగా కె. విశ్వనాథ్ లాంటి దర్శకులు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు మాత్రమే కదపడం కాదు. ఓ కథను చెప్పచ్చొనేది మా చిత్రంలో కనిపిస్తుంది. ‘నాట్యం’లో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల అనుబంధం, క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపించే ప్రయత్నం చేశాం. ఇందులో సితార నాట్యకళాకారిణిగా కనిపిస్తాను. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉండే తేడా ఏంటి? ఇలా రెండు మూడు అంశాల చుట్టూ కథ తిరుగుతుంది. కమర్షియల్ సినిమాలా భారీగా రూపొందించాం.
మెగాస్టార్‌కు తెగ నచ్చింది
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సినిమా చూసి అభినందించారు. ఐదు నిమిషాలే చూస్తానని చెప్పి, సినిమా పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాను ఇంకా చూడలేదు. సినీ నేపథ్యం నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి వచ్చి సినిమా నిర్మాణం చేపట్టడాన్ని ఆయన మెచ్చుకున్నారు. టీజర్ మెగాస్టార్‌కు బాగా నచ్చింది. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణ కోసం వెళ్లి అక్కడే ఉండిపోయా. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని నిర్ణయించుకున్నా. ఇంట్లోవారు కుటుంబ వ్యాపారాన్ని చూసుకోమనేవారు. నా మనసు నాట్యం మీదే ఉండిపోయింది. నా ఆసక్తిని గమనించి కుటుంబసభ్యులిచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. పెళ్లయ్యాక మెట్టింట్లోనూ నాకు అండగా నిలిచారు.