తాలిబన్లను సమర్థిస్తున్న పలువురు భారతీయ ముస్లింలపై బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు అధికారం చేజిక్కుంచుకుంటే మన దేశంలోని కొందరు ముస్లింలు సంబరాలు జరుపుకోవడం ప్రమాదకరమైన విషయమని అన్నారు. దీనితో పాటు పలు విషయాలపై ఆయన స్పందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
"అఫ్గానిస్థాన్లో తాలిబన్లు తిరిగి రావడం వల్ల ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతుంది. కానీ మన దేశంలోని కొన్ని ముస్లిం వర్గాలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నాయి. ఇది ప్రమాదకరం. ఇస్లాంను సంస్కరించి ఆధునికతకు మద్దతివ్వాలో లేదా ఆటవిక, అనాగరిక సంప్రదాయలు ఉన్న విలువలతో బతకాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలి. తాలిబన్లు కచ్చితంగా ఓ శాపం. అలానే 'హిందుస్థానీ ఇస్లాం' చాలా ప్రత్యేకమైనంది." అని నసీరుద్దీన్ షా ఆ వీడియోలో పేర్కొన్నారు.