నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం 'టక్ జగదీష్'. శివ నిర్వాణ దర్శకుడు. ఈ సినిమా విడుదల విషయంలో ఎప్పటి నుంచో సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా దీనిపై నాని స్పష్టత ఇచ్చారు. ఓటీటీలో విడుదల చేయనున్నట్లు చెప్పకనే చెప్పారు. నిర్మాత ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని అన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఇప్పుడిప్పుడే థియేటర్లలో వరుస సినిమాలు విడుదలవుతున్నా, ఏపీలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుచుకోని నేపథ్యంలో 'టక్‌జగదీష్'ను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థ షైన్‌స్క్రీన్ భావించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది. విడుదల తేదీ ఇతర వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
సత్యదేవ్ కొత్త చిత్రం
'తిమ్మరుసు'తో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన యువ నటుడు సత్యదేవ్ కొత్త చిత్రం మొదలైంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్‌నిచ్చారు. దర్శకుడు హరీశ్ శంకర్ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. కాలభైరవ స్వరాలు సమకూర్చనున్నారు. ఇతర నటీనటులు, టైటిల్ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సత్యదేవ్‌కు ఇది 25వ చిత్రం కావడం గమనార్హం.