చిత్రం: టక్ జగదీష్(tuck Jagadish movie review); నటీనటులు: నాని, రీతూవర్మ, ఐశ్వర్యా రాజేశ్, జగపతిబాబు, డానియల్ బాలాజీ, నరేశ్, రావు రమేశ్, ప్రవీణ్ తదితరులు; సంగీతం: తమన్, గోపీ సుందర్(నేపథ్య సంగీతం); సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల; ఎడిటింగ్: ప్రవీణ్ పూడి; బ్యానర్: షైన్ స్క్రీన్ ప్రొడక్షన్స్; నిర్మాత: సాహు గారపాటి, హరీశ్ పెద్ది; కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం:శివ నిర్వాణ; విడుదల: అమెజాన్ ప్రైమ్ వీడియో
తన నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసే నటుల్లో నాని ఒకరు. తొలి నుంచి వైవిధ్య కథలు, పాత్రలు ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నారు. కరోనా కారణంగా గతేడాది ఆయన నటించిన 'వి' ఓటీటీలో సందడి చేసింది. పరిస్థితులు ఇంకా మెరుగుపడిన నేపథ్యంలో తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన 'టక్ జగదీష్(tuck Jagadish movie)' అదే బాటలో పయనించింది. 'మజిలీ' తర్వాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది? నాని తన నటనతో మరోసారి మెప్పించారా? అనే విషయాన్ని సమీక్ష ద్వారా తెలుసుకుందాం.
కథేంటంటే..
భూదేవిపురంలో ఆదిశేషులు నాయుడు(నాజర్) పెద్ద భూస్వామి. కక్షలు, కార్పణ్యాలు లేని గ్రామాన్ని చూడాలని ఆశిస్తుంటాడు. ప్రజలకు సాయం చేస్తూ అందరి తలలో నాలుకలా ఉంటాడు. ఆదిశేషులు నాయుడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు బోసుబాబు(జగపతిబాబు) తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటాడు. చిన్న కొడుకు టక్ జగదీష్(నాని)(Nani Tuck Jagadish review) పట్టణంలో చదుకుంటూ అప్పుడప్పుడు ఊరికి వస్తుంటాడు. ఒకరోజు ఆదిశేషులు నాయుడు గుండెపోటుతో చనిపోతాడు. దీంతో అప్పటివరకూ మంచివాడిగా నటించిన బోసు ఆస్తిపై కన్నేసి తన స్వార్థం కోసం మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్య)ను తన ప్రత్యర్థి వీరేంద్రనాయుడు(డానియల్ బాలాజీ) తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తన అక్కలకు కూడా ఆస్తి ఇవ్వనని అడ్డం తిరుగుతాడు. ఈ క్రమంలో టక్ జగదీష్ ఏం చేశాడు? తన అన్న బోసులో ఎలా మార్పు తీసుకొచ్చాడు? ఊరి ప్రజల భూములపై కన్నేసిన వీరేంద్రనాయుడి ఆట ఎలా కట్టించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా ఉందంటే..
ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న కొడుకైన హీరో వాటిని ఎలా పరిష్కరించాడన్న కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి. మంచి పాటలు, ఫ్యామిలీ ఎమోషన్స్ పండినవేళ ఆయా సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. వెంకటేశ్ ఇలాంటి సబ్జెక్ట్‌తో చాలా ప్రయోగాలే చేశారు. 'టక్ జగదీష్' విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కథానాయకుడి పాత్ర మినహా కొత్త కథ జోలికి పోలేదు. భూదేవిపురంలో జరిగే గొడవలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి చాలా సమయమే తీసుకున్నాడు. ఆయా సన్నివేశాలన్నీ గతంలో మనం చాలా సినిమాల్లో చూశాం. ఇందులో నటులు మారారంతే. 'టక్ జగదీష్' రాకతో కథ మలుపు తిరుగుతుందనుకుంటే ఫ్యామిలీ డ్రామాతో సన్నివేశాలు నడిపించాడు. కథనం కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది. ఆది శేషులునాయుడు చనిపోయే వరకూ ఫక్తు ఫ్యామిలీ డ్రామా తెరపై కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది.
ఆస్తికోసం బోసు అడ్డం తిరగడం, జగదీష్ సర్ది చెప్పే ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలతో కథలో వేగం పెరుగుతుంది. కథానాయకుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడన్న ఆసక్తి మొదలవుతుంది. సరిగ్గా విరామ సన్నివేశాలకు దర్శకుడు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తెరపై చూస్తే ఆసక్తిగా ఉంటుంది. 'టక్ జగదీష్' మళ్లీ భూదేవిపురంలోకి అడుగు పెట్టిన తర్వాత కథ, కథనాలు వేగం పుంజుకుంటాయి. ఊళ్లో ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ తన తండ్రి మాటను నిలబెట్టేందుకు జగదీష్ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో వీరేంద్రనాయుడు నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాడు. దర్శకుడు ఆ టెంపోను చివరి వరకూ కొనసాగించి ఉంటే బాగుండేది. ప్రీక్లైమాక్స్‌కు మళ్లీ ఫ్యామిలీ డ్రామాను తీసుకొచ్చాడు. దీంతో పతాక సన్నివేశాలు ఊహకు తగినట్లుగానే సాగుతాయి. అక్కడక్కడా కార్తి 'చినబాబు' గుర్తుకొస్తుంది.