ఒక వైపు కరోనా భయాలు.. మరోవైపు ప్రదర్శన రంగంలో సమస్యలు.. ఫలితంగా చిత్రసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ధైర్యం చేసి విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలడం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ, 50శాతం సామర్థ్యంతో ప్రదర్శనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలకైతే ఓకే కానీ, భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న చిత్రాలకి పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి.
ఈ నేపథ్యంలో గత వారం విడుదలైన సినిమాలు అంతంత మాత్రం ఫలితాల్ని రాబట్టాయి. చాలా చోట్ల థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. పెద్ద తెరపై తమ సినిమా చూపించాలని దర్శకనిర్మాతలకి, కథా నాయకులకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలంగా లేవు. థియేటర్లలోనే విడుదల చేయాలని ఏడాదికిపైగా ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిపై పడుతున్న వడ్డీల భారం అంతా ఇంతా కాదు. భారం ఇన్నాళ్లూ మోస్తూ వచ్చినా... పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు. దాంతో చాలామంది నిర్మాతలు భారం దించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటీటీలో విడుదల చేయడంపై మొగ్గు చూపుతున్నారు.