"శ్యామ్ సింగరాయ్' కథపై ఉన్న నమ్మకం, అనుకోకుండా చెప్పిన మాట పాపులర్ అవడం వల్ల 'ఈ క్రిస్మస్ మనదే' అంటూ ప్రచారం చేస్తున్నాం' అని నేచురల్ స్టార్ నాని అన్నారు. ఈయన హీరోగా రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కించిన చిత్రమిది. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ కథానాయికలు. ఈ సినిమా డిసెంబరు 24న విడుదల కానున్న నేపథ్యంలో నాని మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు వెల్లడించారు.
* ప్రేక్షకులు మిమ్మల్ని బిగ్‌స్క్రీన్‌పై చూడక రెండేళ్లయింది. దాని గురించి ఏం చెబుతారు?
నాని: పరిస్థితులను బట్టి నేను నటించిన రెండు చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చింది. అంతేకానీ కావాలని ఏం చేయలేదు. సత్వహాగా నేను థియేటర్ అభిమానిని. సినిమా విడుదలైన తొలిరోజు తొలి ఆట కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటా. రెండేళ్ల తర్వాత ఆ అనుభూతి రుచి చూడబోతున్నా.
* ‘శ్యామ్ సింగరాయ్’ కథ విన్నప్పుడు మీకు ఏం అనిపించింది. పాత్రలో లీనమవడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది?
నాని: కథ వినగానే బాగా నచ్చేసింది. దర్శకుడు చెప్పింది చెప్పినట్టు తెరకెక్కిస్తే ఈ సినిమా ఎక్కడికో వెళ్తుందని అనుకున్నా. అంతా నేను ఊహించనట్టుగానే జరిగింది. ఇందులో ద్విపాత్రాభినయం చేశా. పాత్రల్లో ఒదిగిపోయేందుకు ఎక్కువ సమయం పట్టలేదు.
* పీరియాడికల్ కథలో నటించటం ఎలా అనిపించింది?
నాని: ఇతర కథల కంటే పీరియాడికల్ కథలకు చాలా రిస్క్ తీసుకోవాలి. 24 క్రాఫ్ట్‌లు ఒకే తాటిపై నిలిస్తేనే ఇలాంటి వాటిని తెరకెక్కించగలం. అలా ఈ చిత్రానికి మంచి టీమ్ కుదిరింది. ఈ సినిమాలోని సెట్లు మిమ్మల్ని కొత్త లోకానికి తీసుకెళ్తాయి.
* ‘శ్యామ్ సింగరాయ్’ గెటప్ కమల్‌హాసన్ ‘నాయకుడు’ సినిమాను తలపిస్తుంది. మీరేమంటారు?
నాని: అదేం లేదండి. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదు. నా లోపల ఎక్కడో కమల్‌హాసన్‌గారి అభిమాని ఉండటం వల్ల లుక్‌లో ఆ ఛాయలు కనిపించి ఉండొచ్చు.
* దర్శకుడు రాహుల్ సాంకృత్యన్‌లో మీరు మెచ్చిన అంశం?
నాని: 'జెర్సీ' చిత్ర దర్శకుడు గౌతమ్‌లో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో రాహుల్‌లోనూ అవే ఉన్నాయి. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు పెద్దగా స్పందించరు. తాము అనుకున్న ఔట్‌పుట్ వచ్చేంత వరకూ విశ్రమించరు.