Shyam Singha Roy: రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నాని నటించిన 'శ్యామ్ సింగరాయ్' ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అద్భుతమైన కథతో పాటు ఆసక్తికర కథనంతో ఈ సినిమా మంచి అనుభూతిని పంచుతోంది. నాని, సాయి పల్లవి నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. డిసెంబర్ 24న రిలీజ్ అయిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం పోస్ట్ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. పూర్తిగా సాయి పల్లవి సన్నివేశాలతో నిండిన ఈ వీడియోలోని డైలాగులు ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
రవితేజ జోరు..
వరుస సినిమాలతో జోరుమీదున్నారు మాస్ మహారాజా రవితేజ. ఇప్పటికే 'ఖిలాడి', 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. మరో చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.
'స్వామి రారా', 'కేశవ' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న సుధీర్ వర్మ దర్శకత్వంలో 'రావణాసుర' అనే చిత్రం చేయనున్నారు రవితేజ. ఈ సినిమా పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జనవరి 14న ఉదయం 9.50 గంటలకు జరగనుంది.