తను ఏడవకుండా.. గుండెలు పిండేసేలా మనల్ని ఏడిపించగలడు. తను నవ్వకుండా మనల్ని కడుపుబ్బా నవ్వించగలడు.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోగలడు.. ఎవరూ.. అంటారా? ఇంకెవరు నానినే(Nani Actor). గతేడాది 'వీ'తో యాక్షన్ హంగామా చేసిన నాని.. ఈ ఏడాది 'టక్ జగదీష్'తో(Tuck Jagadish Release date) సందడి మొదలుపెట్టారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ వేదిక ద్వారా ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా' నానితో ప్రత్యేకంగా మాట్లాడింది.
ఈ సినిమాతో ప్రేక్షకులకు ఏం చెప్పనున్నారు?
ఇది ఒక మంచి కుటుంబ కథ. మనం 20 ఏళ్ల క్రితం చూసిన అసలైన అనుబంధాలు, ఆప్యాయతల నేపథ్యంలో అల్లుకున్న చిత్రం. ఈ వినాయక చవితి పండగకు అందరూ ఇళ్లలో కూర్చొని 'టక్ జగదీష్' చూసి తప్పక ఆనందిస్తారు. దీన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ఎంతగానో ప్రయత్నించాం. పరిస్థితులు అనుకూలించలేదు. ఇంట్లో పెద్దలు, పిల్లలు కలిసి చూడాల్సిన చిత్రమిది. ఇలా అందరూ థియేటర్‌కు వచ్చే పరిస్థితులు లేవు. ఈ సమయంలో 'అమెజాన్ ప్రైమ్' ద్వారా ఆ కుటుంబాలన్నింటికీ చేరువకావడం సంతోషాన్నిస్తోంది. చూసి అప్పుడే మరచిపోవడం కాకుండా.. కొన్ని రోజుల పాటు దాని గురించి మాట్లాడుకునే చిత్రమిదవుతుందని భావిస్తున్నా.
'టక్ జగదీష్' పాత్ర ఎందుకు చేయాలనుకున్నారు?
నన్ను అందరూ తమ కుటుంబ సభ్యుడిలా చూడాలనుకుంటారు. అలాంటి పాత్రల్లోనే నన్ను ఊహించుకుంటారు. 'గ్యాంగ్‌లీడర్'(Nani Gang Leader), 'వీ'(V Movie Nani) చిత్రాలు రెండు యాక్షన్ థ్రిల్లర్లు. ఈ చిత్రాల తర్వాత నేను ఓ హాస్పిటల్‌కు వెళ్లాను. అక్కడ వైద్యులు, నర్సులు నా దగ్గరికి వచ్చి..'మీరు అలా చంపుతూ.. గొంతులు కోస్తుంటే చూసి తట్టుకోలేకపోయాం.. మంచి ఫ్యామిలీ సినిమా చేయొచ్చుకదా' అన్నారు. అదే సమయంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ కథతో వచ్చారు. నా బలం కుటుంబ ప్రేక్షకులు.. వారికి మళ్లీ దగ్గరవ్వాలంటే ఇలాంటి చిత్రమే చేయాలనుకున్నా. 'టక్ జగదీష్'(Tuck Jagadish) అనే పాత్ర మన అందరి ఇళ్లలో ఉండేదే.
దీనికి మీరు నిర్మాత అయితే ఓటీటీలోనే విడుదల చేసేవారా?
అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. నేను 'వాల్‌పోస్టర్ సినిమా' నిర్మాణ సంస్థను పెట్టినప్పుడే చెప్పాను.. "ఇది లాభాల కోసం స్థాపించినది కాదు.. మంచి కథలను, ప్రతిభను ప్రోత్సహించడానికని".నేను ఈ మాటలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటాను. అయినా నా నుంచి ఏటా మూడు చిత్రాలు తక్కువ కాకుండా వస్తాయి. ఎప్పుడు పరిస్థితులు బాగుంటే.. అప్పుడు థియేటర్ల కోసం నా సినిమా రెడీగా ఉంటుంది.
మొత్తం చిత్రీకరణ లాక్‌డౌన్ సమయంలో చేశారు? ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా?