తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'రెండు భాషల్లో ఒకేసారి.. అదో మంచి అనుభవం' - movie news

'అక్షర' చిత్రం గురించి మాట్లాడిన నటి నందితా శ్వేత.. పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. డైరెక్టర్​ తనను నమ్మితే చాలని తెలిపింది. ఈ సినిమా శుక్రవారం(ఫిబ్రవరి 26) విడుదల కానుంది.

nandita swetha about AKSHARA movie and her personal life
నటి నందితా శ్వేత

By

Published : Feb 25, 2021, 7:07 PM IST

కన్నడ, తమిళ ఇండస్ట్రీల్లో హీరోయిన్​గా గుర్తింపు తెచ్చుకుని 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'బఫ్ల్‌మాస్టర్‌'తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటి నందితాశ్వేత. కన్నడలో సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న నందిత.. తెలుగులోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానున్న 'అక్షర' ప్రమోషన్‌లో నందితా పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం.

అప్పుడు భయపెట్టా..

'ఎక్కడికి పోతావు చిన్నవాడా'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత నేను 'ప్రేమకథా చిత్రమ్‌-2'లో నటించాను. ఈ రెండు హర్రర్‌ ఫిల్మ్స్‌తో అప్పట్లో ప్రేక్షకుల్ని భయపెట్టాను. కానీ ఇప్పుడు 'అక్షర'తో మంచి సందేశాన్ని ఇవ్వనున్నాను. ఇందులో నేను లెక్చరర్‌గా కనిపిస్తాను.

కామెడీ ఉంటుంది..

విద్య వ్యవస్థ, ఫీజులు ఎక్కువగా పెరిగిపోవడం.. ఇలా వివిధ అంశాలను ఈ సినిమాలో చూపించాం. తెలిసిన కథే అయినప్పటికీ కేవలం సందేశాన్ని ఇవ్వడమే కాకుండా కామెడీ, యాక్షన్‌ సీన్లు.. ఇలా అన్నివిధాలుగా 'అక్షర'తో ప్రేక్షకుల్ని అలరిస్తాం. నాతో పాటు షకలక శంకర్‌, శ్రీతేజ్‌, మధునందన్‌, సత్య, ఆజయ్‌ఘోష్‌ ఈ చిత్రంలో నటించారు. కాబట్టి హస్యానికి ఢోకా ఉండదు. అలాగే ముఖ్యమైన సీన్లలో వాళ్ల నటనతో మెప్పిస్తారు.

భయపడ్డా..

తెలుగు ఇండస్ట్రీలో నేను ఇప్పటివరకూ ఇంకా 10 చిత్రాల్లో కూడా నటించలేదు. 'అక్షర' ఒక మహిళా ప్రాధాన్యమున్న చిత్రం. ఈ సినిమా ఆఫర్‌ నాకు వచ్చినప్పుడు చేయగలనా? కెరీర్‌ ఆరంభంలోనే ఇలాంటి పాత్రలో ప్రేక్షకుల్ని మెప్పించగలనా?అనే సందేశాలు వచ్చాయి. కానీ, మంచి కథను అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంలో ‘అక్షర’ ప్రాజెక్ట్‌కు ఓకే చేశాను. నిజం చెప్పాలంటే నా దృష్టిలో ఇది ఒక ధైర్యవంతమైన ఆలోచన.

అక్షర సినిమాలో నందితా శ్వేత

విశ్రాంతి తీసుకున్నా..

లాక్‌డౌన్‌ ప్రారంభమైన సమయంలో మొదటి మూడు నెలలు బాగా విశ్రాంతి తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని కోర్సులు నేర్చుకున్నాను. ఫొటోగ్రఫీ, ఎడిటింగ్‌ వంటివి.

ప్రస్తుతానికి వెబ్‌సిరీస్‌లకు నో..

నా దగ్గరకు కొన్ని ఓటీటీ వేదికగా రిలీజ్‌ అయ్యే కథలు వచ్చాయి. అలాగే కొన్ని వెబ్‌సిరీస్‌ కథలూ వచ్చాయి. కానీ ఇప్పుడే ఆ దిశగా వెళ్లే ఆలోచన లేదు. అలాగే నేను నటించిన చిత్రాలన్నీ థియేటర్లలలో రిలీజ్‌ చేసేందుకే నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే థియేటర్‌లో చూస్తేనే కొన్ని సినిమాలు బాగుంటాయి.

స్క్రిప్ట్‌ నచ్చాలి..

నేను సినిమా ఒప్పుకునే ముందు చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడను. ప్రస్తుతం నేను నటించిన ‘కపటధారి’ మూవీ కన్నడ ‘కవలధారి’కి రీమేక్‌. మాది కర్నాటకనే కాబట్టి ఆ సినిమా చూశాక ‘కపటధారి’కి వెంటనే ఒకే చెప్పేశా. కానీ, థ్రిల్లర్‌ సినిమా కావటం వల్ల హీరోయిన్‌ రోల్‌ తక్కువగానే ఉండొచ్చు. కానీ మంచి సినిమాలో నటించాననే సంతోషం ఉంది. ‘అక్షర’ సినిమాలో మాత్రం మొదటి ఫ్రేమ్‌ నుంచి చివరి దాకా నేనే ఉంటాను. ‘కపటధారి’ చిత్రాన్ని ఒకేసారి తెలుగులో, తమిళంలో చిత్రీకరించారు. అందువల్ల ఒకే షాట్‌లో రెండు భాషల డైలాగ్స్‌ చెప్పాల్సివచ్చేది. అదొక మంచి అనుభవం.

ఒక్క విద్యారంగంలోనే కాదు..

లోటుపాట్లు అనేవి ఒక్క విద్యారంగంలోనే కాదు. అన్ని రంగాల్లోనూ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ చిత్రంలో విద్యార్థి దశలో పిల్లలు ఎన్ని అవస్థలు పడుతున్నారనే కథాంశాన్ని తీసుకున్నాం. నా చిన్నతనంలో ఈ సినిమాలో చూపించిన కష్టాలన్నీ పడ్డాను. ఫీజుల విషయంలోనూ, రూల్స్‌ విషయంలోనూ అన్నీ విపరీత పోకడలను అనుసరిస్తున్నారు. వాటిని ఈ చిత్రం ద్వారా బట్ట బయలు చేస్తాం. డైరెక్టర్‌ చిన్నికృష్ణగారు చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.

ప్రతిభకు చదువే కొలమానం కాదు..

చదువుకుంటేనే జీవితంలో సక్సెస్‌ సాధిస్తామనేది నేను ఒప్పుకోను. కానీ, చదువుంటే విషయపరిజ్ఞానం, నలుగురితో మసులుకునే విధానం అలవడతాయి. నేనూ చదువులో ఎంతో చురుగ్గా ఉండేదాన్ని. కానీ ఉద్యోగం చేయకుండా ఈ రోజు నటనావృత్తిలో కొనసాగుతున్నా.

నటి నందితా శ్వేత

చదువును పరిహాసం చేయలేదు..

ఈ సినిమాలో కామెడీనే ప్రధాన బలంగా ఉన్నా ఎక్కడా కూడా చదువును కామెడీ చేయలేదు. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. కామెడీకి ప్రత్యేకంగా ట్రాక్స్‌ పెట్టలేదు. కథానుగుణంగా హాస్యం పండుతుంది.

చాలా క్యాజువల్‌గా చేశా..

తెలుగులో నా మొదటిసినిమా ‘ఎక్కడకి పోతావు చిన్నవాడా’లో క్యారెక్టర్‌కు బాగా హర్డ్‌వర్క్‌ చేశా. కానీ ‘అక్షర’లో సింపుల్‌గా నటించా. ఎందుకంటే ఈ పాత్ర అంత బలంగా ఉంది.

డైరెక్టర్‌ నమ్మితే చాలు..

ప్రస్తుతం చేతినిండా మంచి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. తమిళం, తెలుగు, కన్నడం అనే భేదం లేదు. డైరెక్టర్‌ ఈ క్యారెక్టర్‌ నందిత బాగా చేస్తుందని నమ్మితే చాలు. ఒక పాత్రలో నటించినపుడు ఆత్మసంతృప్తి అనేది కూడా ముఖ్యమే. ‘అక్షర’తో ఆ కోరిక తీరింది. సినిమా ఫలితం అనేది మన చేతిలో లేని విషయం. నేను నటించే ప్రతీ చిత్రంలో ఒకేలా కష్టపడతా. సక్సెస్‌ దానంతట అదే వస్తోంది. లాక్‌డౌన్‌ తర్వాత థియేటర్లలోకి వచ్చే సినిమాల్లో నాలుగు నావే ఉన్నాయి. ఎంతో సంతోషంగా ఉంది.

నటి నందితా శ్వేత

ఐపీఎస్‌ పాత్రలో నటిస్తున్నా..

‘రాజు గారి గది’ఫేమ్‌ అశ్విన్‌తో ఒక సినిమాలో నటిస్తున్నా. అందులో ఒక యువ ఐపీఎస్‌ అధికారిగా నటిస్తున్నా. ఆ పాత్ర కోసం చాలా కష్టపడుతున్నా.

డబ్బింగ్‌ నేనే చెప్పుకుంటున్నా..

ప్రస్తుతం నా చిత్రాలకు డబ్బింగ్‌ నేను చెప్పుకోవాలనుకుంటున్నా. ఇప్పుడిప్పుడే తెలుగు భాషపై పట్టు పెంచుకుంటున్నా. అయితే ‘అక్షర’కు మాత్రం నేను డబ్బింగ్‌ చెప్పలేదు.

ABOUT THE AUTHOR

...view details