తెలంగాణ

telangana

ETV Bharat / sitara

తీరని నందమూరి తారకరాముని కోరిక... - తెలుగు హీరో ఎన్టీఆర్​

అల్లూరి సీతారామరాజు జీవితచరిత్రను సినిమాగా తెరకెక్కించాలన్నది ఎన్టీఆర్ కోరిక. కానీ అది నెరవేరకుండానే ఆయన చలనచిత్ర జీవితం ముగిసిపోయింది.

తీరని నందమూరి తారకరాముని కోరిక...

By

Published : May 28, 2019, 9:00 AM IST

Updated : May 28, 2019, 9:33 AM IST

నాటి బ్రిటీష్‌ పాలకులను గజగజ వణికించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కథను తెరకెక్కించాలనేది నందమూరి తారకరాముని చిరకాల వాంఛ. కానీ, ఆ కోరిక తీరకుండానే ఎన్‌.టి.రామారావు చలనచిత్ర జీవితం ముగిసిపోయింది.

1954లో పక్షిరాజా ఫిలిమ్స్‌ అధినేత ఎస్‌. శ్రీరాములు నాయుడు నిర్మించిన 'అగ్గిరాముడు' సినిమాలో దాదాపు పదిహేను నిమిషాల పాటు సాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు బుర్రకథా రూపకం ఉంది. ప్రముఖ బుర్రకథా కళాకారుడు నాజర్‌ తన బృంద సభ్యులు లక్ష్మినరసయ్య, రామకోటి, పెరియనాయకి, జయలక్ష్మిలతో కలిసి అభినయించిన ఆ కథా రూపకం 'శ్రీ విలసిల్లెడి తెలుగు దేశమున జననమందినాడా... వినరా ఆంధ్రుడ మన్యసోదరుల వీరగాధ నేడు' అంటూ సాగుతుంది. ఈ బుర్రకథ సాగుతుండగా అల్లూరి సీతారామరాజు వేషంలో రామారావు కొద్దిసేపు కనిపిస్తారు. ఆ పాత్ర రామారావుని ఎంతగానో కదిలించి వేసింది. వెంటనే అల్లూరి సీతారామరాజు పేరుతో సినిమా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చేశారు.

  • ఆ రోజుల్లో పడాల రామారావు రచించిన నాటకం విస్తృత ప్రచారంలో ఉండేది. దానినే అనేక కళాసమితుల్లో నాటకంగా ప్రదర్శించేవారు. అతనికే ఈ సినిమా స్క్రిప్టు రాసే బాధ్యతలను రామారావు అప్పగించారు. అప్పట్లో ఎన్టీఆర్ తన సొంత బ్యానర్‌ మీద 'జయసింహ' చిత్రాన్ని నిర్మిస్తూ ఉన్నారు. ఆ సినిమా తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. 1954 అక్టోబర్‌ 21న 'జయసింహ' సినిమా విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. వాహినీ స్టూడియోలో అల్లూరి సీతారామ రాజు సినిమా కోసం తొలి పాటను 1957 జనవరి 17న రికార్డు చేశారు. ‘హర హర హర మహా ఓంకార నాదాన... పొంగరా ఉప్పొంగి ఓ తెలుగు బిడ్డా’ అంటూ సాగే ఈ పాటను పడాల రామారావు రాయగా టి.వి. రాజు సంగీత దర్శకత్వంలో ఘంటసాల, మాధవపెద్ది, ఎమ్‌.ఎస్‌. రామారావు, పిఠాపురం ఆలపించారు. పత్రికా సమావేశం ఏర్పాటు చేసి చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని రామారావు ప్రకటించారు.
  • రామరాజు సమకాలికుడు మల్లుదొర అప్పట్లో పార్లమెంటు సభ్యునిగా కొనసాగుతున్నారు. ఆయనతో చర్చలు జరిపి కొన్ని సలహాలు స్వీకరించారు. అయితే స్క్రిప్టు విషయంలో ఇంకా కొన్ని అనుమానాలు రావడంతో విస్తృత పరిశోధనచేసి సినిమా తీద్దామని నిర్ణయించి 'పాండురంగ మహాత్మ్యం' చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సినిమా కూడా 1957 నవంబర్‌ 28న విడుదలై విజయవంత మైంది.

ఈలోగా అల్లూరి సీతారామరాజు కథలో స్త్రీ పాత్రలు లేకపోగా, వాటిని సృష్టిస్తే అవాస్తవికతకు ఆస్కారమిచ్చినట్లవుతుందని భావించి ఆ స్క్రిప్టును పక్కనపెట్టి 'సీతారామకల్యాణం' సినిమా నిర్మాణానికి పూనుకున్నారు. అదికూడా 1961 జనవరి 6న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. కానీ సీతారామరాజు సినిమా మాత్రం వెలుగు చూడలేకపోయింది. ఆ విషయాన్ని ఎవరడిగినా రామారావు ఉద్వేగానికి గురయ్యేవారు. దానిని ఒక కావ్యంగా రూపకల్పన చేస్తున్నట్లు చెప్పేవారు. 'విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు' అని నామకరణం చేసి రికార్డు చేసిన పాటను పాండురంగమహాత్మ్యం పాటలతో పాటు రికార్డుగా విడుదల చేశారు.

నటసార్వభౌమ ఎన్టీఆర్​

తరవాత 1968లో ‘వరకట్నం’ సినిమా మొదలుపెడుతూ, సీతారామరాజు సినిమాను కూడా ఈ చిత్రంతోబాటు సమాంతరంగా నిర్మిస్తానని రామారావు ప్రకటించారు. కానీ అదీ జరగలేదు. ‘దేవదాసు’ నిర్మించిన డి.ఎల్‌. నారాయణ సీతారామరాజు కథను శోభన్‌ బాబును హీరోగా పెట్టి తీద్దామని స్క్రిప్టు తయారు చేసి, ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆ స్క్రిప్టును హీరో కృష్ణకు అందజేశారు. కృష్ణకు కథ నచ్చడంతో త్రిపురనేని మహారధి చేత మాటలు రాయించి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా విడుదల చేశారు. అయినా రామారావుకు ఈ సినిమా తీయాలనే సంకల్పం అధికమై పరుచూరి సోదరులను స్క్రిప్టు రూపొందించమని కోరారు. వారి సలహా మేరకు సినిమా తీసేందుకు ముందు కృష్ణ నిర్మించిన చిత్రాన్ని తెరమీద చూశారు. కృష్ణ నిర్మించిన చిత్రం కన్నా ఎవరూ బాగా తీయలేరనే నిర్ణయానికి వచ్చి సీతారామరాజు సినిమా నిర్మించే విషయాన్ని విరమించుకున్నారు. అయితే దాసరి చిత్రం ‘సర్దార్‌ పాపారాయుడు’, మోహన్‌ బాబు చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ సినిమాలలో అల్లూరి సీతారామరాజు గెటప్‌లో రామారావు కాసేపు దర్శనమిచ్చారు. అలా ‘విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు’ సినిమా నిర్మాణం ఆగిపోయింది.

ఎన్టీఆర్​ని ఏడవద్దన్నారు..

'రక్త సంబంధం' సినిమా సమయంలో ఎన్టీఆర్ బోరుమని ఏడ్చే దృశ్యం ఉందట. ఆ సినిమా చూసి చక్రపాణి,.."రామారావు! నువ్వు ఏడ్చే పాత్రలు వెయ్యకు. జనం చూడరు. హీరో ఏడిస్తే ఎవడు చూస్తాడు? దుఃఖం వచ్చే సందర్భం వస్తే, తగ్గించుకో" అని సలహా ఇచ్చారు. ఆ తరువాత ఏడుపు సన్నివేశాల్లో నటించవలసి వస్తే తగ్గించి నటించడం ఆరంభించారట ఎన్టీఆర్​’’.

Last Updated : May 28, 2019, 9:33 AM IST

ABOUT THE AUTHOR

...view details