బాలకృష్ణ(Nandamuri Balakrishna) కథానాయకుడిగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన క్లాసిక్ మూవీ 'ఆదిత్య 369'(Aditya 369). ఈ సినిమా విడుదలై జులై 18వ తేదీకి 30ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. టైమ్ మెషీన్ మాట్లాడుతూ ఈ చిత్రానికి మూల స్తంభాలైన సింగీతం శ్రీనివాసరావు, బాలకృష్ణ, శివలెంక కృష్ణ ప్రసాద్, పేకేటి రంగా, తరుణ్‌ల మనోగతాన్ని మన ముందుకు తీసుకొచ్చింది.
"ఆదిత్య 369 క్రియేట్ చేసింది మాత్రం నేనే. అయితే, టైమ్ మెషీన్ సృష్టికర్తను నేను కాదు. హెచ్‌జీ వెల్స్ అనే మహానుభావుడు దాన్ని నవలగా రాశాడు. నేను చదువుకునే రోజుల్లో ఆ పుస్తకం నాపై ప్రభావాన్ని చూపింది. దర్శకుడు అయిన తర్వాత ఎప్పటికైనా ఈ కథా నేపథ్యంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరగా ఓ సినిమా తీయాలని అనుకున్నా. అనుకోకుండా నేను, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారిని ఒక విమాన ప్రయాణంలో కలిశా. మా మధ్య సినిమాల గురించి చర్చ వచ్చి, ఈ కథను ఆయనకు చెప్పా. ఆయనకు నచ్చడం వల్ల నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌కు చెప్పమన్నారు. అయితే, చర్చలో భాగంగా ఒక షరతు పెట్టారు. 'శ్రీకృష్ణదేవరాయలు పాత్ర నందమూరి బాలకృష్ణ చేస్తేనే.. లేకపోతే ఈ సినిమా లేదు' అన్నారు. అలా ఈ కథను బాలయ్యకు వినిపించడం, ఆయన కూడా ఓకే చెప్పడం వల్ల సినిమా పట్టాలెక్కింది. ఇక సినిమాకు సీక్వెల్ అంటారా? అది కూడా చేసేద్దాం" అని దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 'ఆదిత్య 369'తో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు.